యాదగిరిగుట్ట, డిసెంబర్7: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుమాడ వీధులు, క్యూ కాంఫ్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, బస్టాండ్, శివాలయం, వ్రతమండపం భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీవీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు సేవ చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు. శ్రీస్వామి, అమ్మవార్లతోపాటు క్షేత్రపాలకుడికి సహస్ర నామార్చనతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం జరిపారు.
ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. మాఢవీధుల్లో సువర్ణమూర్తులను బంగారు పుష్పాలతో అర్చించారు. సాయంత్రంవేళలో శ్రీస్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రివేళలో స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, సహస్ర నామార్చన, శయనోత్సవ సేవను శాస్ర్తోక్తంగా జరిగాయి. పాతగుట్టలోని స్వామివారికి ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని ఖాజానాకు రూ. 51,74,567 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, ఈవో వెంకట్రావ్ తెలిపారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. భక్తులు దైవదర్శనం చేసుకుని తరించాలని సూచించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.