“కోట లోపల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సైన్యాధికారి అనంతపాలుని ఆచూకీ తెలియక అందరూ ఆందోళనలో ఉన్నారు. త్రిభువనమల్ల చక్రవర్తికీ, ఆయన భార్య చంద్రలేఖా దేవికీ నడుమ మనస్పర్థలు ఏర్పడ్డాయి. సైన్యంలో ైస్థెర్యం లేదు. దళాల్లో ధైర్యం కనిపించడం లేదు. ముఖ్యంగా సమన్వయం లేదు. ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. యుద్ధరంగంలోకి అడుగు పెట్టకముందే.. ఓటమి అంగీకరించి, తెల్లజెండా లేపేలాగా ఉన్నారు.
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. యాదర్షి తపస్సు, నారసింహావతార రహస్యం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు . అంతలోనే యుద్ధమేఘాలు కమ్ముకొంటాయి.
త్రిభువనుడు తనకు శత్రువు. తాను ఒకప్పుడు, శక్తి చాలక అతడికి లొంగి సామంతుడిగా ఉన్నమాట వాస్తవం. అది అప్పటి పరిస్థితి. కానీ, ఇప్పుడు తాను గెలుపు రుచి చూశాడు. ఓటమి ఎలా ఉంటుందో శత్రువుకి చూపగలిగాడు.
ఇలా ఆలోచిస్తున్న విష్ణువర్ధనుడు సాలోచనగా వార్తాహరుణ్ని చూశాడు. అతడి తలకు పెద్ద గాయమే ఉంది. పసరు రాసి వస్త్రంతో కట్టి ఉన్నా, రక్తపు చారికలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
‘సింహం దాడి చేసింది’ అంటున్నాడు.
ఎక్కణ్నుంచి వచ్చిందీ సింహం?
“అసలేం జరిగింది?” అడిగాడు విష్ణువర్ధనుడు.
“ప్రభూ! నేను భువనగిరి నుంచి బయలుదేరి అటవీమార్గం ద్వారా మీరు బస చేసిన ఈ కృష్ణాతీరం చేరుకోవాలనే ఆత్రుతలో పరుగులు తీస్తూ వస్తున్నాను. ఒకచోట ఒక విచిత్రం జరిగింది. దారి మధ్యలో ఏదో ఆకారం కనిపించింది. ఏమిటా అని దగ్గరకు పోయి చూశాను. అది సింహం ఆకృతిలో నేలమీద పడిన నీడ. నీడ కనిపిస్తున్నది కానీ, ఆ నీడను కల్పిస్తున్న అసలు రూపం కనబడలేదు. చుట్టూ చూశాను. నేలమీద ఉన్న నీడ.. ఒక్కసారిగా
నిటారుగా నిలబడింది..”
చెబుతున్న వార్తాహరుణ్ని ఆపమని చేత్తో సైగచేసి, “నీడ
నిలబడటం ఏమిటి? నిజమే చెబుతున్నావా?” అసహనంగా అడిగాడు విష్ణువర్ధనుడు.
“నిజం ప్రభూ! కళ్లారా చూశాను. నీడ నిలబడటమే కాదు.. సింహం రూపులో అది గర్జించి, నా మీదకు దూకింది”.. భయంభయంగా అప్పటి సంఘటనను తలుచుకుంటూ చెప్తున్నాడు
వార్తాహరుడు.
“దాడి చేసింది సింహం అన్నావు కదా! మరిప్పుడు నీడ అంటున్నావేమిటి? మతి చెడిందా?”.
“కాదు ప్రభూ! కళ్లకు అది ఒక నీడలాగా, ఒక అస్పష్టమైన రూపంలా అనిపిస్తున్నది. కానీ, అది భయంకరంగా గర్జించింది. మీదకు దూకింది. ఇదిగో గాయం! ఇదే నా మాటలకు సాక్ష్యం..” చెప్పాడు వార్తాహరుడు.
“ఇదంతా ఏమిటి సేనాధిపతీ! రహస్యవేగు అనేవాడు శత్రుదేశం రహస్య సమాచారాన్ని సేకరించి రావాలి కానీ, ఇలా భ్రమలకు లోనై కట్టు కథలు చెప్పడమేమిటి?” అంటూ వార్తాహరుడికేసి తిరిగి అడిగాడు.
“ఇంతేనా.. నువ్వు మోసుకొచ్చిన సమాచారం? ఇంకా
ఏమైనా ఉందా?”.
విష్ణువర్ధనుడి మాటలకు భయపడి ఆ వెంటనే తేరుకున్నాడు సేనాధిపతి.
“ఉన్నది ప్రభూ! భువనగిరి కోట లోపలికి మనవాళ్లు వర్తకుల వేషధారణలో ప్రవేశించారు. అక్కడి పరిస్థితులు చాలా స్పష్టంగా వివరించారు” చెప్పాడు సేనాధిపతి.
“ఏమని వివరించారు?” అడిగాడు విష్ణువర్ధనుడు.
“కోట లోపల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సైన్యాధికారి అనంతపాలుని ఆచూకీ తెలియక అందరూ ఆందోళనలో ఉన్నారు. త్రిభువనమల్ల చక్రవర్తికీ, ఆయన భార్య చంద్రలేఖా దేవికీ నడుమ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. సైన్యంలో ైస్థెర్యం లేదు. దళాల్లో ధైర్యం కనిపించడం లేదు. ముఖ్యంగా సమన్వయం లేదు. ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. యుద్ధరంగంలోకి అడుగు పెట్టకముందే.. ఓటమి అంగీకరించి, తెల్లజెండా లేపేలా ఉన్నారు. పూర్తిగా మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి ఉంది. వారి రక్షణ వ్యవస్థ బలహీనపడింది. ఇకపైన జరగవలసింది ఒకటే.. త్రిభువనమల్ల చక్రవర్తిని పదవి నుంచి తొలగించి భువనగిరి నడి వీధుల్లో నడిపించడమే!” వార్తాహరుడు అందించిన సమాచారం ఆధారం చేసుకొని, ఉద్వేగభరితంగా చెప్పాడు సైన్యాధికారి.
త్రిభువనమల్ల చక్రవర్తిని సింహాసనం నుంచి తొలగించి, నడి వీధుల్లో నడిపించడమా?
“త్రిభువనమల్ల చక్రవర్తిని తేరిపార చూసేందుకే, ఎంతటి మొనగాడైనా సర్వశక్తులూ కూడదీసుకోవాలి. కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు గుండె ధైర్యం ఉండాలి. అతడి ఎదుట నిలబడి కత్తిమీద చెయ్యి వేయకముందే.. తల ఎగిరిపోతుంది. అంతటి శక్తిశాలిని.. సింహాసనం మీదినుంచి తొలగించడం, నడి వీధుల్లోకి తీసుకురావడం.. కలలో జరుగుతుందేమో కానీ, ఇలలో జరిగే పనికాదు. ప్రభువుల వారికి కట్టుకథలు, పిట్టకథలూ చెప్పడం ఆపి అసలు విషయాలు వివరిస్తే.. అది మీకూ, ప్రభువుల వారికీ, మన రాజ్యానికీ క్షేమం!”..
వారి మాటలకు అడ్డుపడుతూ అన్నాడు వృద్ధమంత్రి. ఆ మాటలు అస్సలు రుచించలేదు..
సేనాధిపతికి.
“నాలో సగానివి నువ్వు. హృదయంలో పూర్తి భాగానివీ నువ్వే. నేనేం ఆలోచిస్తానో, ఏది ఆచరిస్తానో నాకంటే బాగా నీకే తెలిసుండాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దానిపై చర్చ ఉండరాదు. అన్నీ ఆలోచించే, అన్ని సాధ్యాసాధ్యాలు యోచించే.. నేను ఏ విధానమైనా ఆచరిస్తాను.
యుద్ధ నైపుణ్యంలో తనవంటి బుద్ధిశాలి, శక్తిశాలి ఉండడు. రాజ్యానికి తానే ఒక ప్రధాన రక్షకుడు. అటువంటి తనను ఇలా తేలికగా మాట్లాడటం భరించలేక పోయాడు సేనాధిపతి.
కానీ, రాజుగారి సమక్షంలో ఉన్నాడు కనుక బతికిపోయాడు.
యుద్ధరంగంలోకి ఈ వృద్ధుణ్ని తోసి, రక్షణ లేకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది.. తనేమిటో! తన శక్తి ఏమిటో!
మంత్రివర్యులు చెప్పింది విన్నాడు విష్ణువర్ధనుడు.
అలాగే అతడి మాటలకు సేనాధిపతి ముఖంలో చోటుచేసుకున్న మార్పులనూ గమనించాడు.
“అమాత్యవర్యా! కలలు కంటున్నాం. త్రిభువనమల్లుడిని బంధించి మా సింహాసనం మెట్లమీద కట్లుకట్టి పడేయాలని కలే కంటున్నాం. ముందు కల కంటేనే.. అది నిజం చేసుకొనే ప్రయత్నం చేస్తాం. సాధిస్తాం! కాలం ఎప్పటికీ ఏ ఒక్కరికే అనుకూలంగా ఉండదు. మారుతుంది. పిల్లి అనుకున్నది పులి అవుతుంది. పులి అనుకున్నది పిల్లి పిల్ల అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిభువనుడు మా శక్తిముందు నిలబడలేక.. రక్షణ దుర్గాన్ని బంగారుపళ్లెంలో పెట్టి మాకందించాడు. ఇక మిగిలింది ప్రత్యక్ష యుద్ధమే!” కఠినంగా పలికింది ఆయన స్వరం.
విష్ణువర్ధనుడి మాటల్లోని అంతరార్థం అందరికీ స్పష్టంగా అర్థమైంది. అసలే అధికారంలో ఉన్న రాజుగారు. పైగా మొండివాడు. ఇంక ఎవరు చెప్పినా వినడని తెలిసిపోయింది.
“సరే.. ఇంతకాలం భరించాం. అవమానాలు, అవహేళనలు, మాకూ, మా శత్రువు త్రిభువనమల్లుడికి పోలికలు.. ఏలిక నేనైనా, పోలిక పరపాలకుడితో! అతగాడు సమర్థుడు, యుద్ధవీరుడు, యుద్ధమేదైనా గెలిచితీరే ఘనాపాఠి.. ఎన్నని ఆ త్రిభువనమల్లుని గురించిన గొప్పలు. ప్రశంసలు. అతని ముందు ఎవరూ నిలువలేరనీ, కన్నెత్తి చూడలేరనీ.. ఒకటా, రెండా.. వందనాలన్నీ అతడికి, నిండా నిందలన్నీ మాకు! కాలం మారింది మిత్రులారా.. త్రిభువనుడు కాలసర్పాన్నే శయ్యగా చేసుకొని.. ఆ సర్పతల్పంపై ఇంతకాలం నిద్రపోతున్నాడు. ఇప్పుడా సర్పం అనల్పమై, అతడి ఆయుష్షును హరించేస్తుంది. భువనగిరి సామ్రాజ్య పతాకాన్ని నేలకు దింపి, త్రిభువనుణ్ని పాతాళం పంపిస్తాం! రేపే ప్రత్యక్ష యుద్ధం. సగం చచ్చిన పామును కలుగులో నుంచి వెలుగులోకి లాగి.. నామ
రూపాలు లేకుండా చేయాలి. ఇదే మా శపథం. ఇదే మా లక్ష్యం. ఇదే మా విజయ గర్జన!”.
విష్ణువర్ధనుడు అందరికేసి ఒకసారి చూసి..
సభ నుంచి వడివడిగా బయటికి వెళ్లిపోయాడు.
లేచి నిలబడిన సభికుల్లో కలకలం!
విష్ణువర్ధన మహారాజు సృష్టించిన ప్రళయకాల శంఖారావం ఇంకా మార్మోగుతూనే ఉంది.
విష్ణువర్ధనుడి ఆంతరంగిక మందిరం చాలా కోలాహలంగా ఉంది.
మహారాణి శాంతలా దేవి.. ఉదయాన్నే పూజా కార్యక్రమాలు ముగించుకొని భర్త రాకకోసం ఎదురు చూస్తూ ఉంది.
శాంతలా దేవి.. విష్ణువర్ధనుడు ఏరికోరి పెళ్లాడిన ఇష్టసఖి.
సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉన్న విదుషీమణి.
మహారాజు విష్ణువర్ధనుడు స్వతహాగా సున్నిత మనస్కుడు తన దృష్టిలో.
కానీ, ఆయనను యుద్ధోన్మాదం ఆవహించింది. దురాశ, స్వార్థం, అహంకారం.. ఎటువంటి మంచి మనిషినైనా కలుషితం చేస్తాయి. పాలకుండలో విషపు చుక్కలాగా!
ఎందుకో తన భర్తకు దురాక్రమణ కాంక్ష ఏర్పడింది. ఎవరు చెప్పినా వినడం లేదని అందరూ అనుకోవడం తను విన్నది.
“మహారాణీ! ప్రభువులవారు విజయం చేస్తున్నారు!” చెలికత్తె వచ్చి వినయంగా ప్రకటించింది.
గంభీరమైన వదనంతో లోపలికి వస్తున్నాడు విష్ణువర్ధనుడు.
“ప్రభువులకు స్వాగతం..” అంటూ ఆంతరంగిక మందిరానికి దారి చూపి, లోపలికి నడిచింది.
మౌనంగా ఆమెను అనుసరించాడు.
హంసతూలికా తల్పంపైన విశ్రమిస్తున్న భంగిమలో కూర్చున్నాడు.
“శాంతలాదేవీ! రాజ్యమంతటా విజయోత్సవాలు జరుపుకొంటూంటే, మీ మందిరంలో సంతోష సంబరాలు, ఆనంద చిహ్నాలు కన
బడటం లేదేమిటి?” చుట్టూ చూస్తూ అడిగాడు.
“ప్రభువుల రాక, ఈ ప్రాంగణాన్ని వేయి కాంతులతో ప్రకాశింపజేస్తున్నది. వేరే దీపాలెందుకు?” నవ్వుతూ అన్నది మహారాణి శాంతల.
“అవునా!” అన్నాడు.
చురుకైన చూపు తప్ప, నవ్వు లేదు.. విష్ణువర్ధనుడి మోములో.
అదీ గమనించింది శాంతల.
“ప్రభూ! మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చునా?” ప్రతిస్పందన ఉంటుందా అనుకుంటూ అడిగింది.
“సంతోషంగా అడగవచ్చు. ఒక యుద్ధ ప్రకటన విషయం తప్ప!”.
ముందుగానే ముందుకాళ్లకు బంధం వేశాడు.
ఒక్కక్షణం ఏమీ మాట్లాడలేక పోయింది.
తను అడగ దల్చుకున్న విషయమే.. యుద్ధ ప్రకటన! అదీ వద్దంటే తను ఇంక ఏమి అడగగలదు?
ఆ సందిగ్ధత గమనించాడు మహారాజు.
“నాలో సగానివి నువ్వు. హృదయంలో పూర్తి భాగానివీ నువ్వే. నేనేం ఆలోచిస్తానో, ఏది ఆచరిస్తానో నాకంటే బాగా నీకే తెలిసుండాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దానిపై చర్చ ఉండరాదు. అన్నీ ఆలోచించే, అన్ని సాధ్యాసాధ్యాలు యోచించే.. నేను ఏ విధానమైనా ఆచరిస్తాను. ఆరోజు.. మేము యుద్ధానికి బయలుదేరే సమయానికి విజయ తిలకం దిద్దాల్సిన సమయంలో ‘యుద్ధంలో ఏమవుతుందో ఏమో!’ అని పిరికి పలుకులే పలికావు. అయినా సహించాం. యుద్ధంలో జయించాం. భువనగిరి సామ్రాజ్యపు సరిహద్దుల్లోకి ప్రవేశించి, రక్షణ దుర్గాన్ని తుత్తునియలు చేశాం! ప్రపంచమంతా మమ్ము ‘సాహో!’ అంటున్నది. ‘సాగిపో..
జైత్రయాత్రకు’ అంటున్నది. కానీ, అర్థం చేసుకోవాల్సిన అర్ధాంగి.. మౌనంతో మాత్రమే అర్ధాంగీకారం చెప్తున్నది. ఏమిటి శాంతలా దేవీ! నీ పిరికితనానికి కారణమేమిటి? ఏ శక్తి నిన్ను ఆవహించి, మా మార్గానికి అడ్డుపడేలా చేస్తున్నది?” గద్దించి అడిగాడు విష్ణువర్ధనుడు.
“ఒక మహాశక్తి..” తలవంచుకొనే అన్నది.
“ఏమా శక్తి?” అడిగాడు.
“నరసింహుడు! శ్రీ లక్ష్మీ నరసింహుడే..
ఆ శక్తి!” నెమ్మదిగా చెప్పింది శాంతలా దేవి.
“ఎందుకలా అనిపించింది?” అసహనంగా అడిగాడు.
“వద్దు ప్రభూ! మీరు యుద్ధానికి వెళ్లొద్దు. అది క్షేమకరం కాదని నా మనసుకెందుకో అనిపిస్తున్నది” ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకొంటూ అన్నది.
ఆ శక్తి, నరసింహస్వామి.. అని తనకూ అనిపిస్తున్నది.
ఆ మాటలను కొట్టి పారేశాడు విష్ణువర్ధనుడు.
అతడి కనుల ముందు భువనగిరి సింహాసనంపై తాను కూర్చున్న దృశ్యమే కనిపిస్తున్నది.
allanisreedharthewriter@gmail.com