ఈ సోషల్ మీడియా యుగంలో దేన్నీ దాచలేం. ఎంత గోప్యంగా ఉంచినా.. ఏదో విధంగా అది బయటకు వచ్చేస్తుంటుంది. రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాకు సంబంధించిన పలు అసక్తికరమైన విషయాలు ఇటీవల మీడియా ద్వారా బయటకొచ్చాయి. రామ్ పోతినేని ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారని, ఆమెది రజనీకాంత్ కూతురి పాత్ర అని, రజనీ, రామ్ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అనేలా ఉంటాయని తెలిసింది.
తాజాగా తెలుగమ్మాయి శ్రీలీల కూడా ఇందులో భాగమైనట్టు సమాచారం. ప్రస్తుతం మైసూర్లో ‘ధర్మన్’ షూటింగ్ జరుగుతున్నది. ఆ లొకేషన్లో సంప్రదాయబద్ధమైన లంగా, ఓణీలో సడెన్గా దర్శనమిచ్చారు శ్రీలీల. దాంతో ఎవరో రహస్య కెమెరాలతో ఆమెను క్లిక్ మనిపించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే.. ఇందులో శ్రీలీల పోషించే పాత్ర ఏంటి? అనేది తెలియాల్సివుంది.