సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తేతెలంగాణ) : సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. ప్రస్తుత చార్జీలకు అదనంగా 30 శాతం చొప్పున టికెట్లు జారీ చేస్తున్నారు. కరోనా పరిస్థితులను పక్కన పెట్టి.. సంక్రాంతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రోజువారీగా ప్రకటిస్తున్నారు. సంక్రాంతి ప్రయాణం పేరుతో బుధవారం వరకు దాదాపు 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ పండుగకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందంటూ..రెగ్యులర్ రైళ్లకు బదులు, ఆ స్థానంలో ప్రత్యేక రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ప్రత్యేక రైళ్ల పేరుతో రెగ్యులర్ చార్జీల బదులు..ప్రతి టికెట్‌పై గరిష్టంగా 30 శాతం వరకు అదనంగా వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్లను కేవలం 50 శాతం వరకు నడుపుతున్నారు.
బదులుగా ఎక్స్‌ప్రెస్‌లను నడపడంతోపాటు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8 నుంచి 16 వరకు అన్నిరకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఇరుగు పొరుగు రాష్ర్టాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందని భావించిన రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీల బాదుడు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
శబరిమలకు తగ్గిన రైళ్లు
ప్రతి ఏడాదితో పోల్చితే ఈసారి శబరిమలకు ప్రత్యేక రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గించారు. గతంలో దాదాపు 120 నుంచి 130 వరకు ప్రత్యేక రైళ్లు నడిపిన దక్షిణ మధ్య రైల్వే ఈసారి 23 ప్రత్యేక రైళ్లకే పరిమితమైంది. ఇందులో కాచిగూడ నుంచి నాలుగు,సికింద్రాబాద్ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒకటి మాత్రమే.మిగిలినవి ఏపీ నుంచి నడుపుతున్నారు. కరోనా వల్ల శబరి వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.