తవ్వంత బిడ్డుంటే తల్లికి ఆసరా
కుటుంబంలో ఆడ కూతురు లేని లోటు తీర్చలేనిదే. కొడుకులున్నా తల్లి మాట వినరు. ఇంటి పనులు పట్టించుకోరు. అదే ఆడపిల్ల అయితే తల్లికి సాయపడుతుంది. అందుకే ‘తవ్వంత బిడ్డుంటే తల్లికి ఆసరా’ అన్నారు. తవ్వ అంటే రెండు సోలలు. రెండు తవ్వలు ఒక మానెడు. ఆ ప్రకారంగా, రెండేండ్ల నాటికే బిడ్డ తల్లికి సాయపడుతుందని అర్థం. ఇక మూడేండ్లు వచ్చేసరికి.. తల్లి చెప్పిన చినచిన్న పనులన్నీ చేస్తుంది. ‘గా ముంత అందుకో బేటా’ అంటే ముంత తీసుకొచ్చి అమ్మకిస్తుంది. దీంతో ‘మూడేండ్ల పిల్ల ముంతకు ఆసరా’, ‘ముత్తెమంత బిడ్డ ముంతకు ఆసరా’ అని పొంగిపోయారు పెద్దలు. అదే బిడ్డ పెరిగి, తల్లితో సమానంగా పనులు చేస్తుంటే ‘తానెత్తు బిడ్డవుంటే తల్లికి ఆసరా’ అని మెచ్చుకున్నారు. అబ్బాయినీ చిన్నబుచ్చకుండా.. ‘అమ్మాయి పుడితే అమ్మకు ఆసరా, అబ్బాయి పుడితే అయ్యకు ఆసరా’ అని కూడా అన్నారు.
తెలియని దేవత కంటే, తెలిసిన దయ్యం మేలు
ఈ సామెతను ఎన్నో సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఏమాత్రం తెలియని పనిని తలకెత్తుకునే బదులు.. బాగా తెలిసిన పనినే ఇంకా మెరుగ్గా చేయమని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. కరోనా సమయంలో తమకు బాగా తెలిసిన పనిని పక్కనపెట్టి.. ప్రణాళిక లేకుండా కొత్తకొత్త వ్యాపారాలు చేపట్టి చేతులు కాల్చుకున్నవారు చాలామంది. అదే తెలిసిన పనైతే మరింత సులువుగా, మరింత మెరుగ్గా చేయవచ్చు. ఇబ్బందులు ఎదురైనా ఫర్వాలేదు అనుకుంటే.. తెలియని పనిని భుజానికి ఎత్తుకోవచ్చు. అయితే, అందుకు తగిన కార్యదక్షత చాలా అవసరం. ‘తెలియని దేవత కంటే, తెలిసిన దయ్యం మేలు’ అన్న సామెతలో ఈ హెచ్చరిక అంతర్లీనం.
పిలగానికి పిల్ల ‘దొరింపుగాలె’
కనుమరుగవుతున్న తెలంగాణ పలుకుబడులలో ఇదొకటి. తాతల కాలంలో పిల్లను చూసుకోవడానికి పోయినప్పుడు, లగ్గాలప్పుడు విస్తృతంగా వాడేవారు. దొరింపు అంటే.. కుదరడం/ సర్దుబాటు/ ఒప్పందం/ నిర్ణయం/ అంగీకారం అని అర్థం. ఈ పదాలన్నీ సందర్భాన్ని బట్టి వినిపిస్తూ ఉంటాయి. ‘మా పోరనికి లగ్గంజేద్దామంటే పిల్ల ఏడ దొరింపు అవుతలేదు’ అంటారు. ‘ఎహే.. మొన్నటి సంది అప్పుకోసం తిర్గుతున్న. ఎక్కడ దొరింపు కాలె’ అనీ అంటారు. ఇరువురికీ ఇంపుగా ఉండటమే దొరింపు. అది బంధమైనా, సంబంధమైనా, అప్పయినా, సొప్పయినా సరే. మాట దొరింపు, ముచ్చట దొరింపు, మనసు దొరింపు.. ఇలా అనేక పదబంధాలతో కలిపి దొరింపును ఉపయోగించారు జానపదులు. ఇప్పుడేమో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అంటూ మాతృభాషను మరిచిపోతున్నాం.
డప్పు రవి