తుర్కయంజాల్, డిసెంబర్ 22 : పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొదించి అమలు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు సిలబస్ పూర్తి చేసేలా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ 100 శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచిస్తున్నారు. అధికారులు ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వారి సూచనల మేరకు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులును నిర్వహించాలని విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. సబ్జెక్టుల వారీగా నిపుణులతో ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ ఉపాధ్యాయులకూ శిక్షణ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ నెల 31 వరకు సిలబస్‌ను పూర్తి చేసి, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఉత్తీర్ణత పెంచే దీశగా చర్యలు..
సకాలంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటుగా ఆయా సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తి చేసిన తరువాత జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రతి సబ్జెక్ట్‌పై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు గ్రాండ్ టెస్టు నిర్వహించి వారిని ప్రీ ఫైనల్ పరీక్షకు సిద్ధం చేయనున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం పూట అదనపు తరగతులు నిర్వహించి తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పరీక్షలంటే భయం పోయేలా చేస్తున్నాం..
పరీక్షలంటే భయం పోయేలా పదో తరగతి విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– తిరుపతి భాయి, ప్రధానోపాధ్యాయురాలు, కొహెడ ప్రభుత్వ పాఠశాల, తుర్కయంజాల్ మున్సిపాలిటీ
ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు సాధించేలా..
ప్రతి సబ్జెక్ట్‌పై విద్యార్థులు పట్టు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వమిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపాం. బట్టీ విధానం కాకుండా ఎలా గుర్తుంచుకోవాలో వివరిస్తున్నాం.
– దన్నె రాజు, సోషల్ టీచర్, కొహెడ, ప్రభుత్వ పాఠశాల, తుర్కయంజాల్ మున్సిపాలిటీ
అదనపు తరగతులు చాలా ఉపయోగకరం..
పాఠశాలలో అదనపు తరగతులు నిర్వహించడం చాలా ఉపయోగకరం. సబ్జెక్ట్‌లో సమస్యలు ఉంటే అదనపు తరగుతుల సమయంలో ఉపాధ్యాయుల వద్ద నుంచి తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ప్రతి రోజు పరీక్షలు నిర్వహించడం వల్ల పరీక్షలంటే భయం పోయింది. ప్రతి సబ్జెక్ట్‌లో ఏ విధంగా మార్కులు సాధించాలనే అంశాలు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
– నీలిమ, పదో తరగతి, కొహెడ ప్రభుత్వ పాఠశాల, తుర్కయంజాల్ మున్సిపాలిటీ