సూర్యాపేటటౌన్, ఆగస్టు 1 : బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నర్సింహ హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాదరణకు గురైన బాల బాలికలను, తప్పిపోయిన బాలలను గుర్తించి సంరక్షించడంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టికి గురవుతున్న 127 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు క్షేమంగా అప్పగించామన్నారు. అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీములు వివిధ ప్రదేశాల్లో ఉన్న బాలలను గుర్తించి రక్షణ కల్పించామన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఎస్బీ సీఐ రామారావు, డీసీఆర్బీ పీఐ మగ్దుం అలీ, ఎస్ఐ మౌనిక, నీలిమ, చైల్డ్ సంరక్షణ అధికారులు శ్రీలక్ష్మి, ఉమామహేశ్వరి, నాగుల్‌మీరా, నాగరాజు, వంశీ, విద్యాసాగర్, ముస్కాన్ బృందం, ఎస్ఐ మల్లేశం, రహీమొద్దీన్, ఏఎస్ఐలు వెంకన్న, సైదాబీ తదితరులు ఉన్నారు.
నీలగిరి, ఆగస్టు 1: పిల్లల హకుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన, ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్ ముసాన్ కార్యక్రమం ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు పోలీసు శాఖలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, మహిళ, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర శాఖల సమన్వయంతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైసు మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్ షాపులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ ప్రదేశాలు మరియు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 124 మంది చిన్నారులను సంరక్షించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారన్నారు. చిన్నారులను పనుల్లో నియమించుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేరొన్నారు. రక్షించిన చిన్నారుల్లో అధిక సంఖ్యలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారన్నారు. వీరిలో చాలామంది రైసు మిల్లులు, బేకరీలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అదనపు ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో పని చేసిన డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ అంజలి, సిబ్బంది, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి గణేష్, ఎన్జీవో శోభారాణిలను అభినందించారు.