Temple collapse : దక్షిణాఫ్రికా (South Africa) లో కొత్తగా నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం (New Ahobilam Temple) కుప్పకూలింది. ఆ దేశంలోని డర్బన్ నగరం (Durban city) సమీపంలోని ఓ పట్టణంలో నిర్మాణంలో నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆటంకాలు ఎదురవుతుండటంతో శనివారం సహాయక చర్యలు నిలిపివేశారు. వాతావరణం అనుకూలిస్తే రెస్క్యూ ఆపరేషన్ను పునరుద్ధరించనున్నారు. అయితే శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు.
టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు