Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Saurav Ganguly) కి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫ్రాంచైజీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్-2027 (IPL-2027) సీజన్‌కు జట్టు హెడ్‌కోచ్‌గా అతడిని నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 2019 నుంచి అనుబంధం ఉన్న గంగూలీ.. ఇప్పటివరకు ఆ జట్టులో పలు కీలక బాధ్యతలు నిర్వహించాడు. తొలిసారి ఐపీఎల్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు.
గంగూలీ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పురుషుల, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. తాజాగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో అతడి పాత్ర మరింత కీలకంగా మారనుంది. గత రెండు సీజన్లుగా జట్టుకు కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ స్థానంలో గంగూలీ రానున్నాడు. అదే సమయంలో బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, టీమ్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ ఇయాన్ బెల్‌ను కొనసాగించకూడదని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించింది.
కాగా, 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు సీజన్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గంగూలీ తనకు అనుకూలమైన సపోర్ట్ స్టాఫ్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అతడి కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. గత ఏడాది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు గంగూలీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడి పర్యవేక్షణలో ఆ జట్టు ఫైనల్‌కు చేరింది.
ఐపీఎల్లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై గంగూలీ సంతోషం వ్యక్తంచేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రాంచైజీ అని చెప్పాడు. జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, కొత్త సీజన్లో బలమైన, భయపడని జట్టును నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో కూడిన నాయకత్వ బృందంతో గంగూలీ కలిసి పనిచేయనున్నాడు.
2026 ఐపీఎల్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్ విభాగంలో అనుభవం కూడా పెరిగింది. గంగూలీ గత ఏడాదే ఢిల్లీ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చలకు తెరదించుతూ అధికారికంగా ఆ పదవిలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ గంగూలీ నియామకాన్ని స్వాగతించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలో గంగూలీ ఎప్పటి నుంచో కీలక సభ్యుడని, అతడి అనుభవం, నాయకత్వం కొత్త బాధ్యతలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు. ఐపీఎల్-2027 వేలానికి ముందు జట్టు ప్రణాళికలను గంగూలీ పర్యవేక్షించనున్నాడు. వచ్చే సీజన్ తర్వాత మెగా వేలం జరగనున్న నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపించడంలేదు.
ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కూడా జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. దాంతో 19 ఏళ్లుగా సీఎస్కే కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ శకం ముగిసింది.