Vegesna Satish | ‘శతమానం భవతి’ సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ల దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్లపై సాదత్, ముని శివ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న హీరోలుగా నటిస్తుండగా, రిధ్ది కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వి.కె. నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
టీజర్ విషయానికి వస్తే.. పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ప్రథమార్ధంలో ఒకరినొకరు అసహ్యించుకుంటూ, తీవ్రమైన ఘర్షణలతో పోట్లాడుకునే ఇద్దరు యువకుల పాత్రలతో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. వారిద్దరి మధ్య ఉన్న వైరం కేవలం స్నేహం లేదా వ్యక్తిగత గొడవ మాత్రమే కాకుండా, వారి తండ్రులైన రాజేంద్ర ప్రసాద్, నరేష్‌ల మధ్య ఉన్న పాత కక్షలు, పరస్పర విద్వేషాలకు ముడిపడి ఉన్నట్లు టీజర్ ద్వారా అద్భుతంగా చూపించారు. యువ హీరోల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు, హీరోయిన్లతో సాగే లవ్ ట్రాక్స్ సినిమాకు సరికొత్త కలర్‌ఫుల్ అండ్ ఎంటర్టైనర్ డైమెన్షన్‌ను ఇస్తాయని స్పష్టమవుతోంది. సతీష్ వేగేశ్న తనదైన శైలిలో కుటుంబ విలువలు, హాస్యం, ఎమోషన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని మలిచారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వైజాగ్ అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా వైబ్రెంట్‌గా, కలర్ఫుల్గా తెరపై ఆవిష్కరించింది. రామాంజనేయులు ప్రొడక్షన్ డిజైనింగ్, మధు ఎడిటింగ్ పనులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రిధ్ది కుమార్, మేఘా చౌదరి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వి.కె. నరేష్, అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సుదర్శన్, ప్రవీణ్, ఆనంద్, రచ్చ రవి, శివన్నారాయణ, అన్షు రెడ్డి, మణిచందన, సిజ్జు, భద్రం, చింటు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.