పనాజీ: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి ఘటనలో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. సోనాలితో పాటు గోవాకు వెళ్లిన ఆమె సహోద్యోగులే ఆమెను చంపి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు. టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గుండెపోటుతో మరణించినట్టు మంగళవారం వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సోనాలి మరణానికి ముందు కూడా ఆమె తమ తల్లి, సోదరి, బావతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మందులు కూడా వాడటం లేదని అన్నారు.