AP News | కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడనే అక్కసుతో ఓ దళిత తల్లిని చిత్రహింసలకు గురిచేశారు. తమ ఆడబిడ్డను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆమెకు ఓ మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేసేందుకు యత్నించారు. కానీ విషయం తెలియడంతో పోలీసులు సమయానికి వచ్చి సదరు మహిళను రక్షించారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఆటవిక చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం కల్లుకుంటకు చెందిన ఓ దళిత యువకుడు.. అదే గ్రామానికి చెందిన బీసీ యువతిని ప్రేమించాడు. ఆరు నెలల క్రితం పెద్దలకు తెలియకుండా ఆ యువతిని పెళ్లి చేసుకుని ఊరి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో యువకుడి కుటుంబం కూడా గ్రామం విడిచి వెళ్లింది.
ఇటీవల అబ్బాయి తల్లి కల్లుకుంట గ్రామానికి వచ్చింది. ఇది తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. గ్రామంలోని ఓ చెట్టుకు కట్టేశారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేసేందుకు యత్నించారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సమయానికి చేరుకుని మహిళను రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు.