ఖిలావరంగల్, జూలై 08: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల కృషి తప్పని సరిగా ఉండాలని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అన్నారు. మంగళవారం శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ప్రధానోపాధ్యాయుడు పూస నరేంద్రస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఇచ్చిన హోం వర్క్‌ను ఇంటి వద్ద పూర్తి చేసే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. క్రమశిక్షణతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
ప్రభుత్వం పాఠశాలలకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్లో చేరిన మొదటి రోజు విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందచేశామన్నారు. వారానికి మూడు రోజులు గుడ్లతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పాఠశాలలోని విద్యార్థులు స్ఫూర్తి కార్యక్రమం ద్వారా జీవన నైపుణ్యాలు ఎలా అలవర్చుకోవాలి, మంచి జీవనశైలి కొరకు ఎలాంటి అలవాట్లని నేర్చుకుని జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య, సంపత్, తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజు, అంజయ్య, నరేందర్, సంపత్, ప్రకాష్, స్వప్న, కవిత, సుహాసిని, ధనలక్ష్మి, భవాని, కిరణ్మయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.