న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. రాష్ట్రపత్ని అంటూ ఆయన నోరుజారారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఇవాళ లోక్‌సభలో కేంద్ర స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ముర్మును అవమానించారని ఆమె ఆరోపించారు. ఆదివాసి విరోధి, మహిళా విరోధి, దళిత విరోధి కాంగ్రెస్ అని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు అందరూ లేచి నిలబడి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పాలంటూ అరిచారు. కోవిడ్ నుంచి కోలుకున్న మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుకోకుండా నోరు జారినట్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. చిన్న విషయాన్ని బీజేపీ పెద్దగా చేస్తోందని ఆరోపించారు. అయితే అధిర్ క్షమాపణలు చెప్పారని సోనియా గాంధీ ఓ మీడియాతో వెల్లడించారు.