ఖైరతాబాద్, జనవరి 7: చిన్న పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రాజకీయ పార్టీల నిధులతో యూట్యూబ్ చానళ్లను నిర్వహించేవారు జర్నలిస్టులే కాదని, పత్రికకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్యన సన్నటి విభజన రేఖ ఉంటుందని స్పష్టం చేశారు. చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.10 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ టీయూడబ్ల్యూజే (143) అనుబంధ తెలంగాణ ఎంప్యానెల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘చిన్న, మధ్యతరహా పత్రికల సంపాదకుల కృతజ్ఞత సభ’ను నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజిగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యోగానంద్, నవీన్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అవ్వారి భాస్కర్ తదితరులు క్షీరాభిషేకం చేశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఎంప్యానెల్మెంట్ అనేది నిరంతర ప్రక్రియని, వారితోపాటు తాత్కాలిక (అడ్హాక్) ప్రాతిపదికన ఉన్నవారికి కూడా అక్రెడిటేషన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. జర్నలిస్టులు నడిపిస్తున్న డిజిటల్ మీడియాపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని, వారికి కూడా అక్రిడిటేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించడంతోపాటు హెల్త్‌కార్డులు సైతం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మారుతీసాగర్ కొనియాడారు. జర్నలిస్టుల సొంతింటి కలను త్వరలోనే సాకారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇండ్ల నిర్మాణాలు, స్థలాల కేటాయింపులు జరిగాయని తెలిపారు. సభలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (తెమ్జు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, తెలంగాణ ఎంప్యానెల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కో-కన్వీనర్ సిరికొండ అగస్టిన్, సీనియర్ జర్నలిస్టులు జానకీరామ్, కేసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎంప్యానల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బిజిగిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సిరికొండ అగస్టిన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసరి వెంకటేశ్వర్రావు, గౌరవాధ్యక్షుడిగా డీఎస్ఎన్మూర్తి, సలహాదారులుగా కే సూర్యనారాయణ, ఉస్మాన్ రషీద్, ఉపాధ్యక్షులుగా జానకీరామ్, అవ్వారి భాస్కర్, అర్పెల్లి శ్రీనివాస్, వెన్నమళ్ల రమేశ్‌బాబు, కట్ట రాఘవేందర్రావు, ట్రెజరర్‌గా జీ ప్రభాకర్, జాయింట్ సెక్రటరీలుగా ఖలీల్, జే సంపత్, కార్యవర్గ సభ్యులుగా సాయికిరణ్, పీ సత్యం నియమితులయ్యారు.
చిన్న పత్రికలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పత్రికల ఇబ్బందులను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన సీఎం కేసీఆర్ చర్చించి నెలవారీగా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆహ్వానించతగిన పరిణామమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన జర్నలిస్టులు రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా
క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.