ఉప్పల్, నవంబర్ 21 : స్కైవాక్ పనులు చక చకా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పిల్లర్ల పనులు పూర్తికావచ్చాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు చుట్టూ స్కైవాక్ నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తి అయితే రోడ్డును సులువు గా దాటేందుకు వీలు ఉంటుంది. ఆకాశంలోనే నడకతో రామంతాపూర్, నాగోల్, సికింద్రాబాద్, ఘట్కేసర్, తదితర ప్రాంతాల వైపునకు రోడ్డును దాటవచ్చు. అదేవిధంగా మెట్రోస్టేషన్‌లోకి చేరుకోవచ్చు.
ఉప్పల్ రింగ్‌రోడ్డులో నిర్మించే స్కైవాక్లోకి వెళ్లేందుకు వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉప్పల్‌లోని వరంగల్ బస్టాండ్, పోలీస్‌స్టేషన్ ప్రాంతం, ఉప్పల్-వరంగల్ రహదారికి పక్కన ప్రాంతం, ఉప్పల్-నాగోల్ వెళ్లే బస్టాండ్ ప్రాంతం, ఉప్పల్-రామంతాపూర్ రోడ్డు మార్గంలోని కేవీ స్కూల్ ప్రాంతంలో, ఉప్పల్-సికింద్రాబాద్ వైపులోని థీమ్‌పార్కు ప్రాంతంలో మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయాప్రాంతాల్లో స్కైవాక్‌కు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, మెట్లు, లిఫ్ట్‌ల సౌకర్యం ఉంటుంది. ఉప్పల్-వరంగల్ రహదారి పక్కన ప్రాంతంలో మాత్రం లిఫ్ట్‌లు, మెట్ల మార్గం రానుంది.
ఉప్పల్ రింగ్‌రోడ్డులో నిర్మిస్తున్న స్కైవాక్‌తో ఉప్పల్ చౌరస్తా ట్రాఫిక్ ఫ్రీగా మారనుంది. ఎలివేటెడ్ కారిడార్, స్కైవాక్, మెట్రో మార్గం ఉండ టంతో ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి. ఇప్పటికే చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు, స్కైవాక్ పనులు పూర్తికావస్తున్నాయి. ప్రస్తుతం నిర్మించనున్న స్కైవాక్ 665.5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 6.15 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. వీటికి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మెట్ల సౌకర్యం ఉంటుంది. స్కైవాక్ నిర్మాణానికి 35 పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్కైవాక్ వెళ్లడానికి ఆయా రోడ్డు మార్గాలకు అనుగుణంగా 6 మార్గాల ద్వారా ప్రవేశాలు ఉంటాయి.