సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు సైబర్‌నేరగాళ్లు రెండు నెలల కిందటే రంగంలోకి దిగినట్లు దర్యాప్తులో తేలింది. సర్వర్‌పై దాడి చేసి.. ఆధారాలు దొరకకుండా కొంత డేటాను సైతం తొలగించినట్లు తెలిసింది. గోల్కొండకు చెందిన షాన్వాజ్ బేగం అనే మహిళ తన పేరుతో మహేశ్ బ్యాంక్‌లో ఈ నెల 11న సేవింగ్ ఖాతాను తెరిచింది. ఆమె హైదరాబాద్, పుణెకు తరచూ వెళ్తుంటుంది. ఈ ఘటన జరిగిన తరువాత పుణెలో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అలాగే అత్తాపూర్, సిద్దిఅంబర్‌బజార్, నాగోల్, హుస్సేనీ ఆలం, కూకట్పల్లి మహేశ్ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో శాన్విక ఎంటర్ప్రైజెస్, హిందుస్తాన్ ట్రేడర్స్, ఫార్మా కంపెనీల పేర్లతో ఉన్న ఖాతాలను నేరగాళ్లు ఉపయోగించారు. ఇందులో ఇద్దరు ఖాతాదారులను పోలీసులు విచారిస్తున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.
ప్రధాన సర్వర్‌పై దాడి చేసి..
కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్‌పై దాడి చేసి.. ప్రధాన అకౌంట్ నుంచి రూ. 12.93 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. వాటిని మహేశ్ బ్యాంక్‌లో ఉన్న ఖాతాల్లోకి మొదట మళ్లించారు. అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 129 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. షాన్వాజ్ పుణె వెళ్లి వస్తుండడంతో ఆమెతో పరిచయమైన సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిచే పనిని అప్పగించారా? డబ్బు ఆశ చూపి.. అకౌంట్ తెరిపించారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. నాలుగు ఖాతాల్లో నుంచి డబ్బులు బదిలీ కాగా, ముగ్గురు అందుబాటులో లేరు. కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇతని ఖాతా నుంచి రూ. 5 లక్షలు ఇతర అకౌంట్లకు బదిలీ అయ్యాయి.
ముంబై నుంచే హ్యాకింగ్..?
మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ బంజారాహిల్స్‌లో ఉంది. దీనికి సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెందిన సంస్థ అందిస్తుంది. ప్లాన్‌లో భాగంగానే ఆయా ఖాతాల నగదు లావాదేవీల పరిమితిని రూ. 50 కోట్లకు పెంచేశారు. ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి.. సర్వర్లపై దాడి చేశారు. ఆ ప్రాక్సీ సర్వర్.. ఐపీ అడ్రస్ అమెరికాకు చెందిన ఒక సంస్థ ద్వారా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది జూలైలో తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు సైబర్‌నేరగాళ్లు ఇదే పద్ధతిని అవలంబించారు. బెంగళూర్ నుంచి వచ్చిన ఓ మహిళ తన పాత చిరునామాతో బ్యాంకులో అకౌంట్ తెరువగా, టోలీచౌకి ప్రాంతంలో ఉండే ఓ నైజీరియన్ స్థానికులకు రూ. 20 వేలు ఆశ చూపి.. వారితో ఖాతాలు తెరిపించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు సర్వర్‌పై దాడి చేసి.. రూ. 1.96 కోట్లు కొల్లగొట్టారు. ఇదే తరహాలో మహేశ్ బ్యాంక్‌ను దోచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్బీఐకి లేఖలు..
మహేశ్ బ్యాంక్‌కు సంబంధించిన సర్వర్లోకి వెళ్లి డేటాను కొంత తొలగించడం, దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు నగదు బదిలీ కావడంతో సీసీఎస్ పోలీసులు ఆర్బీఐకి లేఖలు రాశారు. బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం ఇచ్చారు.