
అమీర్‌పేట్, నవంబర్ 13: ‘పక్కింటివాళ్లకు మస్తు డబ్బు ఉన్నది. అదంతా రాత్రికిరాత్రే మా ఇంట్లో వచ్చిపడాలి.. తెల్లారేసరికి కోటీశ్వరులమైపోవాల.. దొంగతనంచేస్తే పోలీసులకు దొరికిపోతాం.. అందుకే ఏమాత్రం కష్టంలేకుండా, ఎవరికీ అనుమానం రాకుండా డబ్బుమూట వచ్చి ఒళ్లో పడాలి.. ఏంచేయాలి..? క్షుద్రపూజలు.. యస్.. మంచి మంత్రగాన్ని పట్టుకొని క్షుద్రపూజలు చేస్తే పక్కింటి డబ్బంతా మనింట్లో వచ్చిపడుతుంది’.. ఇది ఓ వ్యక్తి దురాశ. ఆలోచన రాగానే యూట్యూబ్‌లో వెదికి అలాంటి క్షుద్రపూజలు చేసే వ్యక్తిని పట్టుకొన్నాడు. వేలకు వేలు ఖర్చుచేసి పూజలు చేయించాడు. కానీ డబ్బురాలేదు. ధనంమూట తన ఒళ్లో పడలేదు. సరికదా.. ఉన్న డబ్బు ఊడ్చుకుపోయింది. ఇంకేముంది పూజలోనే లోపం ఉందని భావించి పూజారిని తుపాకీతో బెదిరించి నిలువుదోపిడీ చేశాడు. చివరకు పూజారి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.
కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఉన్న ఆరుగురు స్నేహితులను యూ ట్యూబ్‌లో వచ్చి న ఓ కథనం తప్పుదారి పట్టించి కటకటాల పాల్జేసిం ది. ఏపీలోని నంద్యాలకు చెందిన ఫయాజ్ హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి మెదక్‌కు చెందిన సురేశ్, ఖైరతాబాద్వాసి వెంకట లక్ష్మీనర్సింహారావు, కర్నూలుకు చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన సాంబయ్య, కర్ణాటక వాసి రాహుల్ స్నేహితులు. వీరంతా జగద్గిరిగుట్ట చుట్టుపక్కలో నివాసముంటున్నారు. ఫయాజ్ కొద్ది రోజుల క్రితం యూ ట్యూబ్‌లో క్షుద్రపూజలకు సం బంధించి ఓ వీడియో చూశాడు. క్షుద్ర పూజలు చేస్తే పక్కింట్లోని ధనాన్ని మనింట్లోకి రప్పించవచ్చని తెలుసుకొని ఓ నిర్ణయానికి వచ్చిన ఫయాజ్, గుం టూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన పురుషోత్తమాచారి (55)ని పూజల కోసం సంప్రదించాడు. అక్టోబర్ 22న అతన్ని నగరానికి తీసుకొచ్చి కూకట్పల్లి, కుత్భుల్లాపూర్‌లో రెండిండ్లను ఎంపికచేసి పూజలు ప్రారంభించారు. ఇందుకోసం రూ.3 లక్షల వరకు ఖర్చుచేశారు. రోజులు గడుస్తున్నా డబ్బురాకపోవటంతో పురుషోత్తమాచారిని తాము చేసిన ఖర్చులన్నీ ఇవ్వాలని ఎయిర్ గన్, ఎయిర్ పిస్టల్‌తో బెదిరించారు. పురుషోత్తమాచారి ఫోన్ నుంచి అతని బంధువులకు ఫోన్లు చేసి రూ.85వేలు వేర్వేరు అకౌం ట్ల ద్వారా ఆన్లైన్లో డబ్బులు దండుకొని అతడిని వదిలిపెట్టారు. అప్పటికీ ఆగకుండా పురుషోత్తమచారిని ఫోన్లో డబ్బుల కోసం వేధించటం మొదలుపెట్టారు. దీంతో విసుగుచెందిన పురుషోత్తమాచారి నాలుగు రోజుల క్రితం సనత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సనత్‌నగర్ పోలీసులు బాలానగర్ ఎస్వోటీ పోలీసులతో కలిసి ఫయాజ్ అతని మిత్రులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎయిర్ గన్, ఎయిర్ పిస్టల్, చెర్రలు, రూ. 3 వేల నగదు, 8 సెల్ఫోన్లు, ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు.