హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నేరాలపై పోలీసులు జరిపే పరిశోధనకు గుండెకాయ లాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 6 నెలలు పూర్తయింది. ఆ ప్రమాదంలో కొన్ని వేల ఫైళ్లు, ఎన్నో కేసులకు చెందిన ఆధారాలు బూడిదయ్యాయని ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. కానీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎఫ్ఎస్ఎల్లో అగ్గి రాజేసిందెవరో పోలీసులు నేటికీ తేల్చలేకపోయారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజే మీడియాతో మాట్లాడిన పోలీస్ ఉన్నతాధికారులు.. ఆ ప్రమాదానికి కారణాలేమిటో అన్వేషిస్తామని చెప్పారు. కానీ, ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో నేటికీ చెప్పలేకపోయారు. అగ్నిప్రమాదం జరిగిన రోజే ఫైర్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నాగ్‌పూర్‌కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ నిపుణులను తీసుకొచ్చి ప్రమాద కారణాలను విశ్లేషించడంతోపాటు డాటాను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నించారు. ఎఫ్ఎస్ఎల్లో కాలిపోయిన గదులకు అధికారులు ఇటీవల రంగులు వేయించి, మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎఫ్ఎస్ఎల్లోని సీజర్ రూమ్‌లోనే ఈ ప్రమాదం జరుగడం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తాయి. కానీ, ఆ ప్రమాదం జరిగిన తీరును, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు బయటపెట్టలేదు. దాదాపు 50 కంప్యూటర్లు, వాటి హార్డ్ డిస్క్‌లు కాలిపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిందితుడుగా ఉన్న ‘ఓటుకు నోటు’ కేసు ఫైళ్లు కూడా దగ్ధమైనవాటిలో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటో, దగ్ధమైన ఫైళ్ల వివరాలేమిటో బయట పెట్టాలని బీఆర్ఎస్ నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నా పోలీసులు నోరు మెదపడం లేదు.