‘ఇది పూర్తిగా మురుగదాస్ సినిమా. ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. నిజంగా సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. హిట్ మిషిన్ అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన పాటలిచ్చారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చుపెట్టే నిర్మాత ఎన్వీ ప్రసాద్‌గారు. ఇలాంటి నిర్మాతలు ఉండబట్టే తెలుగులో తరచుగా సినిమాలు వెయ్యికోట్లకు వెళ్తున్నాయి.
లవ్, యాక్షన్ ఈ కథలో రెండు పిల్లర్స్. రుక్మిణి వసంత్‌తో లవ్‌సీన్స్ చాలా బాగా వచ్చాయి. అందరికీ తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం’ అని హీరో శివకార్తికేయ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘మదరాసి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీమూవీస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో శివకార్తికేయ మాట్లాడారు. ఈ సినిమాలో భాగం అయినందుకు కథానాయిక రుక్మిణీవసంత్ ఆనందం వ్యక్తం చేశారు. శివకార్తికేయన్ ‘అమరన్’ తర్వాత వస్తున్న సినిమా ఇదని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఇంకా బీస్ట్‌బెల్స్ ఉదయ్ కూడా మాట్లాడారు.