వెండితెరపై హిట్‌పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. మరోవైపు ఈ జంట ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జంట మూడోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం సెట్స్‌మీదకు వెళ్లింది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్లో విజయ్-రష్మిక పాల్గొంటున్నారు.
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత వారిద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. రాయలసీమ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.