Sircilla | సిరిసిల్లలో కేటీఆర్ తన బంధువులకు 8వేల ఎకరాలు కట్టబెట్టిండు. సందీప్‌కుమార్ ఝా అనే కలెక్టర్‌ను వేస్తే.. ఉక్కుపాదం మోపి 2400 ఎకరాలు రాబట్టిండు. రకరకాల కారణాలతో అతన్ని బదిలీ చేశాం. ధరణిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు ఈ భూములను కొల్లగొట్టారు. ఈ భూములను పేదలకు పంచాల్సిన బాధ్యత మాపై ఉన్నది.
నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాం.. మాట్లాడుతాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు ఆ 8వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అంతేకాదు, ఆ భూములు ఎవరి పేరుపై, ఏ ఊరిలో ఉన్నాయో చెప్పాలి. బీఆర్ఎస్ ఏ ఏ నాయకుడు కొల్లగొట్టారో ఆధారాలతో నిరూపించాలి. లేదంటే ఇన్ని రోజులు చెప్పినవన్నీ అబద్ధాలే అని ఒప్పుకొని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అనంతరం రాజన్న దర్శనం చేసుకొని పాప ప్రక్షాళన చేసుకొని వెళ్లాలి.
ముఖ్యమంత్రి చెప్పిన 8వేల ఎకరాలతో పాటు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా రాబట్టినట్టు చెబుతున్న 2400 ఎకరాల భూముల వివరాలను అధికారికంగా ఇవ్వండి. అందుకోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నాం. ఏ గ్రామంలో.. ఏ సర్వేనంబర్‌లో 8వేల ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టారు? ఆ భూమి స్వభావం (ప్రభుత్వ, ఫారెస్ట్, ఇనాం, అసైన్డ్, సీలింగ్, భూదాన్, ఎండోమెంట్ లేదా ఇతర భూములు) వివరాలు, అలాగే గ్రామాలు, సర్వేనంబర్లు, కొల్లగొట్టినట్టు చెబుతున్న బీఆర్ఎస్ నాయకుల వివరాలన్నింటినీ సమగ్రంగా ఇవ్వండి. వీటితోపాటుగా సీఎం చెప్పినట్టు 2400 ఎకరాల భూమి ఏ గ్రామం నుంచి రాబట్టారు? సర్వే నంబర్ ఎంత? ఆ భూముల వివరాలు అధికారికంగా ఇవ్వండి. అలాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన నాయకుల పేర్లపై ఉన్న వివరాలను తాము దరఖాస్తులో పేర్కొన్న విధంగా ఇవ్వండి.
కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అసెంబ్లీ సాక్షిగా భూములపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని సిరిసిల్ల భూముల విషయంలో చేసిన ఆరోపణలు సైతం సర్కార్‌ను ఇరకాటంలో పడేశాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే సిరిసిల్లలో సీన్ రివర్స్ అయ్యింది. అసెంబ్లీ సాక్షిగా ఏకంగా 8వేల ఎకరాలను కేటీఆర్ తన బంధువులకు, బీఆర్ఎస్ శ్రేణులకు కట్టబెట్టారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సందీప్ కుమార్ ఝా అనే కలెక్టర్ 2400 ఎకరాలను రాబట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిందే తడవుగా.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర నాయకులు ఎడాపెడా ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా.. ఈనెల 30న సిరిసిల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించే సభతో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం అవుతుదంటూ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇన్ని ఆరోపణలు చేసిన అధికార పార్టీ ప్రస్తుతం ఇరకాటంలో పడింది. ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని స్వయంగా కేటీఆర్ డిమాండ్ చేయడం, ఇదే సమయంలో వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద బీఆర్ఎస్ శ్రేణులు అధికారికంగా దరఖాస్తు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ మారింది.
నిజానికి సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా 2024 జూన్ 16 నుంచి 2025 సెప్టెంబర్ 27 వరకు పనిచేశారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను 2025 సెప్టెంబర్ 27న రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సిరిసిల్ల నుంచి బదిలీ చేసింది. కలెక్టర్‌పై ప్రతిపక్ష పార్టీ కంటే అధికార పార్టీ నాయకులే అనేక విమర్శలు చేశారు. ప్రొటోకాల్ పాటించలేదంటూ.. ఏకంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసే సర్కార్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, కలెక్టర్ ఝా వ్యవహార శైలి బాగాలేదని పేర్కొంటూ టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి మృత్యుంజయం ఏకంగా ముఖ్యమంత్రికే బహిరంగ లేఖ రాశారు. అలాగే, మరికొంత మంది అధికార పార్టీ నాయకుల నుంచి కూడా ఝాపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. సందీప్ కుమార్ ఝా పనిచేసిన కాలంలో బీఆర్ఎస్ నాయకులనే లక్ష్యంగా చేసుకొని అనేక ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలున్నాయి. ఇది ఇలా ఉంటే.. తహసీల్దార్లను వినియోగించి రకరకాలుగా నోటీసులు జారీచేసి.. భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన పనిచేసిన కాలంలో సుమారు 300 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఝా వెల్లడించారని కొన్ని పత్రికలు రాశాయి.
నిజానికి కేవలం స్వచ్ఛందంగా అప్పగించిన కొంత మంది భూముల వివరాలు తప్పితే ఆయన స్వయంగా స్వాధీనం చేసుకున్నట్టు భూముల వివరాలను గానీ, సర్వేనంబర్లను గానీ ప్రకటించలేదు. ఏ వ్యక్తి నుంచి ఎంత భూమి స్వాధీనం చేసుకున్న వివరాలు పత్రికలకు విడుదల చేయలేదు. ప్రతికా ముఖంగా ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించలేదు. అలాంటప్పుడు ఆ కలెక్టర్ స్వయంగా 2400 ఎకరాలు రాబట్టిండు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఇదే సమయంలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. నిజంగా బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టినట్టుగా ఝా నివేదిక ఇచ్చి ఉంటే.. కలెక్టర్ సిరిసిల్ల నుంచి వెళ్లి ఏడాది అవుతున్నా.. ఇన్నాళ్లూ సర్కార్ వాటి స్వాధీనం కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం చూస్తే మొత్తం 4,68,532 ఎకరాల భూములుండగా ప్రస్తుతం జిల్లా మొత్తంగా 22-ఏ,బీ,సీ,డీలలో కలిపి 3,718 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు 8వేల ఎకరాలు సర్కార్ భూములను బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టి ఉంటే.. వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలి కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటికి కాంగ్రెస్ సర్కార్ తప్పక సమాధానం చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.
ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్యేగా స్వాగతం చెబుతూనే 8వేల ఎకరాలపై శ్వేత పత్రం విడుదలచేయడంతో పాటు సర్వేనంబర్ల వారీగా వివరాలు వెల్లడించాలని కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ విషయంలో బహిరంగ లేఖను విడుదల చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. అధికారులు చెబుతున్న ‘ఆఫ్ ది రికార్డు’ సమాచారం ప్రకారం చూస్తే.. అసలు 8 వేల ఎకరాలు కొల్లగొట్టిన దాఖలాలు గానీ, 2400 స్వాధీనం చేసుకున్నట్టు వివరాలు గానీ ఎక్కడా లభ్యం కావడం లేదని ఉన్నతాధికారులే చెప్తున్నారు. అయితే వారు వారి పేర్లను వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు అర్థమైంది. దీంతో తమ పంతం నెగ్గించుకోవడానికి ఏవో ఒక లెక్కలు ఇవ్వాలంటూ కొంత మంది అగ్రనాయకులు అధికారులపై ఒత్తిడి పెంచినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే బీఆర్ఎస్ సమాచార హక్కు చట్టం అస్ర్తాన్ని ప్రయోగించింది. దీంతో సమాచారం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. కలెక్టర్ ఝా స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న 2400 ఎకరాల భూముల వివరాలు, అలాగే బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టినట్టు చెబుతున్న 8వేల ఎకరాల ఆనవాళ్లు కూడా అధికారుల వద్ద లేవని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సిరిసిల్ల పర్యటనలో సీఎం చూపుతారా? లేక మళ్లీ ఏదో విమర్శలు చేసి.. విషయాన్ని కప్పిపుచ్చి దాటవేస్తారా..? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి మాటలను పట్టుకొని, స్థానికంగా ఎడాపెడా విమర్శలు చేసిన హస్తం నాయకుల్లోనూ అంతర్మథనం మొదలైంది. ఇరుకున పెట్టబోయి ఇరుక్కున్నామంటూ.. అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారని తెలుస్తున్నది
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ముదిరాజ్ కులస్తులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏలోకి మారుస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న సిరిసిల్ల పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి, ముదిరాజ్‌ల రిజర్వేషన్ అంశంపై జిల్లా వేదికగానే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. సోమవారం తెలంగాణ భవన్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ముదిరాజ్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ విజయవంతం కావడంపై కేటీఆర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించినందుకు నాయకులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చాలనేది అత్యంత న్యాయమైన డిమాండ్ అని, దాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పితే ముదిరాజ్‌లు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. వారి హకులు సాధించే వరకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉండి పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 28: ‘సీఎం సారూ.. సిరిసిల్లకు ఉత్తచేతులతో రావద్దు. ఆటో కార్మికులకు బాకీపడ్డ జీవనభృతి రూ.34వేల చొప్పున చెల్లించాకే రావాలి’ అని ఆటో యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయకుంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామని, విప్ ఆది శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు

సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తమ గ్రామంలో సాగునీటి సమస్య తీర్చాలని చిప్పలపల్లి రైతులు కోరుతున్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామంలోని అఖిల పక్షం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం జిల్లాలోని వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించారు.
వేములవాడ రూరల్, సెప్టెంబర్ 28: సిరిసిల్లలో 30న జరుగనున్న సీఎం సభ ఏర్పాట్ల కోసం చంద్రగిరి గుట్టల నుంచి వందల ట్రిప్పుల మట్టి తరలించడంపై కలెక్టరేట్ ప్రజావాణిలో చంద్రగిరి సర్పంచ్ ముత్తా సంజన ఫిర్యాదు చేశారు.