మాన్సా: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు మొదలుపెట్టింది. సిద్ధూ ప్రయాణించిన మహేంద్ర థార్ వాహనాన్ని ఇవాళ ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఆ ఎస్యూవీ నిండా బుల్లెట్లు నిండిపోయి ఉన్నాయి. థార్‌లో వెళ్తున్న సిద్దూను రెండు కార్లు వెంబడించాయి. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కారు ముందు భాగంతో పాటు ఇరు వైపులా బుల్లెట్ రంథ్రాలు ఉన్నాయి. బుల్లెట్ కేసింగ్‌లను ఫోరెన్సిక్ బృందం సేకరిస్తోంది. కారు మెజర్మెంట్స్ను కూడా తీసుకున్నారు.
సిద్దూ మర్డర్‌తో ఢిల్లీలోని తీహార్ జైలుకు లింకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఓ ఫోన్ నెంబర్‌ను జైలుతో కనెక్ట్ అయినట్లు గుర్తించారు. ఇటీవల షారూక్ అనే నేరస్థుడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో మెసేజింగ్ యాప్ ద్వారా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, అతని సంబంధికులతో పాటు కాలా జతేది, కాలా రామ్‌లను కూడా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారించింది.
స్కార్పియో కారు నెంబర్ ప్లేట్‌ను దుండగులు బొలెరో కారుకు వాడినట్లు తెలుస్తోంది. స్కార్పియో ఓనర్ ఫిరోజ్‌పూర్‌కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 8 నుంచి 10 మంది కనీసం 30 సార్లు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అన్ని రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత కూడా అతను చచ్చాడో లేదా అని దుండగడులు సిద్దూ శరీరాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. బుల్లెట్ల ఆధారంగా ఏఎన్ 94 రష్యా అజాల్ట్ రైఫిల్‌ను వాడినట్లు భావిస్తున్నారు. సిద్ధూ కారులో కూడా ఓ పిస్తోల్ ఉన్నట్లు గుర్తించారు. అయితే దాని గురించి ఫోరెన్సిక్ బృందం వివరణ ఇవ్వనున్నది.
సిద్దూ హత్యపై విచారణకు జుడిషియల్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం భగవంత్‌మాన్ తెలిపారు. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించనున్నారు.