హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉద్యోగి కుమారుడు కోసూరి ద్రోణకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సీఎండీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేయడంతో కారుణ్య నియామకాలను చేపట్టినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాసర్, చీఫ్ లైజన్ ఆఫీసర్ మహేశ్, అడిషనల్ మేనేజర్ వెంకటేశం, ఎస్ఈ సంజీవరెడ్డి పాల్గొన్నారు.