– పీఆర్పీ బకాయిలు, పే అప్గ్రేడేషన్ అమలుకు డిమాండ్
రుద్రంపూర్, జూన్ 29 : సింగరేణి అధికారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI)–SCCL బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలు జూలై 13 వరకు కొనసాగనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. రానున్న రోజుల్లో వివిధ విభాగాలకు చెందిన అధికారులు దశలవారీగా దీక్షలను కొనసాగించనున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి అధికారులకు న్యాయమైన హక్కులు లభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోల్ ఇండియా అధికారులకు అమలు చేస్తున్న విధానాలను సింగరేణి అధికారులకు కూడా వర్తింపజేయాలని కోరారు.
– కోల్ ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి
– పెండింగ్లో ఉన్న పీఆర్పీ (PRP) బకాయిలను వెంటనే చెల్లించాలి
– కోల్ ఇండియా అధికారులతో సమానంగా అలవెన్సులు, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలి
– సింగరేణికి రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి
సింగరేణి యాజమాన్యం, సంబంధిత ప్రభుత్వాలు అధికారుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జీఎం స్టాఫ్ ఆఫీసర్ గోవిందరావు, సిఎంఓఏఐ కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు, వీకే సీఎం పీఓ నరసింహరావు, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు, క్వాలిటీ మేనేజర్ సత్యనారాయణ రాజు, ఎస్టేట్ ఆఫీసర్ తౌరియా, ఏఎస్వో అభిలాష్తో పాటు పలువురు అధికారులు హాజరై సంఘీభావం ప్రకటించారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యశస్వి, డిప్యూటీ మేనేజర్ భరత్ చంద్ర, డిప్యూటీ మేనేజర్ మౌనిక, సీనియర్ అండర్ మేనేజర్ గాయత్రి, అండర్ మేనేజర్ వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.