Thug Life | కోలీవుడ్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తన సినిమాలతో పాటు చేష్టలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. హీరోయిన్లతో ఎఫైర్లు, దర్శకులు, నిర్మాతలతో గొడవలు వంటి నెగెటివ్ విషయాలతో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. షూటింగ్‌కు ఆలస్యంగా రావడం, నిర్మాతలను ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు ఆయనపై చాలాసార్లు వచ్చాయి. ఒకానొక సమయంలో ఆయనపై నిషేధం విధించాలని కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఇలాంటి శింబును లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం పూర్తిగా మార్చేశారట.
మణిరత్నం దర్శకత్వంలో ఇంతకుముందు ‘నవాబ్’ సినిమాలో నటించిన శింబు, ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్లో శింబు చాలా క్రమశిక్షణగా, సమయానికి హాజరవుతూ నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట.
తాజాగా ‘థగ్ లైఫ్’ ప్రమోషనల్ ఈవెంట్లో ఒక విలేకరి ఇదే విషయంపై ప్రశ్నించగా, మణిరత్నం సినిమాకు వచ్చేసరికి అంత మంచి బాలుడిగా ఎలా మారిపోయారని అడిగారు. దీనికి శింబు సమాధానమిస్తూ.. “ఒక సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది దర్శకుడి చేతుల్లో ఉంటుంది. మణిరత్నం గారు అంత పెద్ద దర్శకులైనా, అందరికంటే ముందు షూటింగ్‌కు వచ్చేవారు. అది చూసి నేను కూడా క్రమశిక్షణతో మెలిగాను. చాలా మంది దర్శకుల్లా సెట్‌కు వచ్చాక సీన్ ఎలా చేద్దామని ఆయన చర్చించరు. ఏం చేయాలో ముందే పూర్తి స్పష్టతతో వస్తారు. చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఏదైనా మార్పు చెప్పాలన్నా, ఏదైనా వివరించాలన్నా మానిటర్ దగ్గర కూర్చుని అరవడం ఉండదు. మనం ఎంత దూరంలో ఉన్నా ఆయనే దగ్గరికి వచ్చి చెబుతారు. మణిరత్నం గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన లాంటి దర్శకులు నా కెరీర్లో ఉండి ఉంటే, నేను మరిన్ని సినిమాలు చేసేవాడిని, అభిమానులను సంతోషపెట్టేవాడిని. మణి సార్ నాతో ఎన్ని సినిమాలు చేయమన్నా నేను సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. ప్రస్తుతం శింబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.