
అందోల్, అక్టోబర్ 27 : ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం అందోలులోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నేతలు ‘దోచుకో.. దాచుకో’ అనే నినాదంతో పని చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గతంలో సంక్షేమ పథకాలు పార్టీ నేతలకే ఇచ్చేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు, నాయకులకు సరైన గుర్తింపు ఉంటుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గలోని వివిధ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
‘విజయగర్జన’ను విజయవంతం చేయాలి
నవంబర్ 15 వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజవర్గంలోని 9 మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సూచించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు, నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని సభకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించుకోవాలన్నారు. ఆహారం, మంచినీరు ఇతర ఏర్పాట్లను ముందే చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, 9 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.