
అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు. మహిళల్లోని సంఘటిత శక్తి వారి కుటుంబానికి ఆధారమైన వ్యక్తులుగా మారుస్తున్నది. సిద్దిపేట జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరూ వివిధ వ్యాపారాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో 18,478 స్వయం సహాయక సంఘాలు, 723 గ్రామైక్య సంఘాలు ఏర్పాటు చేయగా, 2,01,759 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి కింద బర్రెల పెంపకం, కిరాణా దుకాణాలు, వ్యవసాయం చేసుకుంటూ సమయానికి రుణాలు చెల్లిస్తున్నారు. రూ.లక్ష రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం వడ్డీ మాఫీని కూడా వర్తింపజేసింది. దీంతో వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం మహిళలు స్త్రీ నిధిని ఆశ్రయిస్తున్నారు.
గజ్వేల్, అక్టోబర్ 27 : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైవ్స్ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలశాఖ నర్సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణను ఫెర్నాండేజ్ ఫౌండేషన్, యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ ఏరియా దవాఖానతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు దవాఖానల్లో నిర్వహిస్తున్నది. కాగా, ఈ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి శిక్షణ వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, ఫలితాలను కేంద్ర సభ్యులు పరిశీలించారు. గజ్వేల్ పట్టణంలోని ఏరియా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా స్టాఫ్ నర్సులకు నిర్వహిస్తున్న మిడ్వైవ్స్ శిక్షణ విధానాన్ని ఆమె బుధవారం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ జాయిట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ, నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విద్యులత, యూనిసెఫ్ వైద్యవిభాగం అధికారిణి డాక్టర్ సలీమా భాటియా, ఫెర్నాండేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ రాధారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీజీ రతిబాలచంద్రన్ దవాఖానలో శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఫెర్నాండేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ డాక్టర్ రాధారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్, మిడ్వైవ్స్ శ్రీలత, భార్గవి శిక్షణ గురించి ఏడీజీ రతి బాలచంద్రన్కు క్షుణ్ణంగా వివరించారు. సాధారణ ప్రసవాలను అధికంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా తమ వద్ద 12మందికి 4నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణలో గర్భిణులు సాధారణ ప్రసవాలు జరుగడానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, సాధారణ ప్రసవాల వల్ల లాభాలు, గర్భిణికి సాధారణ ప్రసవాలపై విశ్వాసం కలిగేలా ఏవిధంగా చేయాలి అన్న అంశాలపై మిడ్వేవ్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం మిడ్వైవ్స్ ద్వారా సేవలు పొందిన గర్భిణులు, బాలింతలతో మాట్లాడినప్పుడు వారంతా సంతోషంగా తమ అనుభవాలను రతిబాలచంద్రన్కు వివరించారు. మిడ్వైవ్స్ వల్ల తాము చాలా నేర్చుకున్నామని, గర్భాధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని, అలాగే వ్యవహరించడం వల్ల తమకు సాధారణ ప్రసవాలు జరిగాయని రతిబాలచంద్రన్కు వివరించగా ఆమె కూడా మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిడ్వైవ్స్ సేవలే కాకుండా గజ్వేల్ దవాఖానలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ దవాఖాన వైద్యులను, సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వ కృషి భేష్..
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రసవాల పెంపునకు ప్రభుత్వంతో పాటు వైద్యులు, సిబ్బంది అద్భుతంగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతిబాలచంద్రన్ అన్నారు. మిడ్వైవ్స్ శిక్షణ పొందిన నర్సులు, సేవలను పొందుతున్న గర్భిణులు, సాధారణ ప్రసవాలు జరిగిన బాలింతలతో సుదీర్ఘంగా ఆమె చర్చించారు. వారి అనుభవాలను తెలుసుకున్న రతిబాలచంద్రన్ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిడ్వైవ్స్ శిక్షణను చేపట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని, దాని ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ఈ మిడ్వైవ్ శిక్షణను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి గజ్వేల్లోని దవాఖానలో శిక్షణ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించామన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా కూడా ఈ మిడ్వైవ్స్ శిక్షణను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు తెలిపారు.