
ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఆవిర్భవించి అప్పుడే ఇరవై ఏండ్లు కావస్తున్నది. నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్నది. ప్లీనరీకి ఉమ్మడి జిల్లా నుంచి నేతలు హాజరుకానున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ మరోసారి ఎన్నిక కానుండడంతో జిల్లా ప్రజలు సంతోషానికి గురవుతున్నారు. అడుగడుగునా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే శరణ్యమని నమ్మి జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ. ఈ పార్టీని ఆది నుంచి ఆదరించి అక్కున చేర్చుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో జరిగిన రాస్తారోకోలు, వంటావార్పులు, దీక్షలు, రైల్‌రోకోలు, బంద్‌లు, నిరసన కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ ఏర్పాటుకు నాంది సిద్దిపేట నుంచే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లను టీఆర్ఎస్ ఎదుర్కొన్నది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టువీడకుండా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించింది. ఇది టీఆర్ఎస్ పార్టీకి చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఉద్యమం చేపట్టిన నాయకుడే నేడు పాలన పగ్గాలు చేతబట్టారు. సమైక్య రాష్ట్రంలో అన్నివిధాలుగా దగాకు గురైన మెతుకుసీమ.. ఇప్పుడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో అభివృద్ధి బాటన పయనిస్తున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ మరోసారి ఎన్నిక కానున్నారు. నేడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే ప్లీనరీ సమావేశాల్లో అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ప్రకటించనున్నారు. అనంతరం ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్లీనరీకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆహ్వానం అందిన ప్రతినిధులు తరలి వెళ్లనున్నారు. మూడేండ్ల తర్వాత నిర్వహిస్తున్న ప్లీనరీకి రాష్ట్ర పార్టీ నాయకత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. 2018లో హైదరాబాద్‌లో ప్లీనరీ జరిగింది. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా నిర్వహించలేదు. ప్లీనరీకి పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్యనేతలకు ఆహ్వానాలు అందినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్లీనరీ ఉదయం 10 గంటలకే ప్రారంభం కానున్నది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్లీనరీ జరుగనున్నది. వచ్చేనెల 15న వరంగల్‌లో విజయగర్జనను నిర్వహించనున్నారు. 20 ఏండ్ల ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ తొలినాళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యమనేత కేసీఆర్‌కు అధికారాన్ని రాష్ట్ర ప్రజలు అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడంతో ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉంటున్నారు. తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. హైదరాబాద్‌లో ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమంలోని కొన్ని ఘట్టాలు ఇలా…
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు నాంది ఇక్కడే…
1985 నుంచి టీడీపీ తరఫున ఓటమెరుగక సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (ప్రస్తుత ముఖ్యమంత్రి) రాష్ట్ర మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వర్తించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన జన్మభూమి పథకం రూపకల్పనలో ఆయన పాత్ర ముఖ్యమైనది. జన్మభూమి స్ఫూర్తితో తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలోని సొంత ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఆయన విరాళంగా ఇచ్చారు. దానిని ఆనుకొని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని గ్రామంలోని వెనుకబడిన తరగతుల వారి ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా అందించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన చంద్రశేఖర్‌రావుకు అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఓవైపు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అప్పటి సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి సీఎం చంద్రబాబును నిలదీస్తూ బహిరంగ లేఖ రాశారు. అదే సమయంలో చంద్రబాబును విబేధించి తన వైఖరిని వెల్లడించారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై పిడికిలెత్తారు. ఆయన చొరవకు తెలంగాణ వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. అధికార పార్టీలో ఉండి పోరాటం చేయడం కన్నా ఎదురు నిలిచి ఉద్యమించాలని నిర్ణయించారు.
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్ష..
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్ష బయలుదేరిన కేసీఆర్‌ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా, సిద్దిపేట దీక్షాస్థలి వద్ద హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమయ్యారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేయడం, హరీశ్‌రావు దీక్షాస్థలి వేదిక పైనే ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. ఉద్యమం ఉధృతమైంది. ఒకవైపు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం బాట పట్టడంతో జిల్లా విద్యార్థి లోకం లేచింది. జిల్లా విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులను చైతన్యపరిచేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సులు జరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యమంలో భాగంగా 2011లో జహీరాబాద్ శివారులో హరీశ్‌రావు నేతృత్వంలో 65వ నంబరు జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రైలురోకోలతో సికింద్రాబాద్, ముంబై, నిజామాబాద్ మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తెలంగాణ కోసం రోడ్లపై వంటావార్పు, రోడ్ల దిగ్భంధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
వరుసగా రెండోసారి అధికారంలోకి…
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని పార్టీగా ఎదిగింది. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడంతో యావత్తూ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఎన్నికలు ఏవైనా అవి టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటున్నది. గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లలో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అన్ని జిల్లా పరిషత్‌లు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పనిచేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ కావడంతో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దీంతో అన్నిరంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఉద్యమ ఘట్టాలు కొన్ని…
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లను ఎదుర్కున్నది. తెలంగాణ ఉద్యమం ఉధృతిని ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించింది. ఇది టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక మైలురాయి. ఉద్యమం చేపట్టిన నాయకుడే నేడు పాలనా పగ్గాలు చేతబట్టారు. తొలుత 2001లో పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలారు. మూడొద్దులకే పార్టీ మూసుకుపోతుందని ఎన్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు. అయినా ఎక్కడ కూడా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఆయనకు చేదోడుగా సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, తదితర నాయకులతో పాటు జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీని నడిపించడంలో అండగా నిలిచారు. పార్టీని ప్రారంభించిన సమయంలో వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ తన సత్తాను చాటింది. వివిధ జిల్లాల నుంచి గెలుపొందిన స్థానిక ప్రజాప్రతినిధులతో సిద్దిపేటలో కేసీఆర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా వేదికగా ఎన్నో ఉద్యమాలను చేశారు. 2005లో వరంగల్‌లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు. సిద్దిపేట నుంచి వరంగల్ బహిరంగ సభ వరకు ఆయన వెంట సైకిళ్ల పై వందల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీ పై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై సభకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.