సిద్దిపేట టౌన్, నవంబర్ 11 : మారుతున్న కాలానికనుగుణంగా ఎక్సైజ్ శాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ తరహాలో పట్టణాల్లోని సూపర్మార్కెట్ల మాదిరిగా వాక్ ఇన్ స్టోర్ మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం నిబంధనలను సరళతరం చేస్తూ అబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి గురువారం మాట్లాడుతూ మద్యం వ్యాపారంలో నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు, కొత్త వారిని ఆకర్శించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. మద్యం ప్రియుల కోసం వాక్ ఇన్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. దుకాణాల టెండర్లు దక్కించుకున్న వారు ఎవరైనా వాక్ ఇన్ స్టోర్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రూ.5 లక్షలు అదనపు వార్షిక ఆదాయం చెల్లించి ఇలా మార్చుకునే వెసులుబాటును ఆబ్కారీ శాఖ కల్పించిందని తెలిపారు. స్టోర్‌లో ప్రత్యేకంగా మద్యానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను విక్రయించుకోవచ్చన్నారు. అదే విధంగా రూ.25 వేలు చెల్లిస్తే దుకాణం పొందిన వారు నెల రోజుల్లోగా వేరే చోటుకు దుకాణాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం, ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చని, ఆన్‌లైన్‌లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఏ దుకాణం కోసమైన ఆబ్కారీ భవన్లో టెండర్ సమర్పించేందుకు అవకాశం ఇచ్చామన్నారు. లాటరీలో దుకాణం పొందిన వారు తొలి విడుత ఎక్సైజ్ పన్ను చెల్లించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామన్నారు. ఈ నెల 18తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని, 20న కలెక్టర్ సమక్షంలో డ్రా తీస్తామన్నారు. తొలి విడుత పన్ను ఈ నెల 22 లోగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. లేని పక్షంలో అనర్హుడిగా ప్రకటించి రూ.5 లక్షల పరిహారాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేశారు. టెండర్లో గెలుపొందిన మద్యం దుకాణదారులకు 29న మద్యాన్ని సరఫరా చేస్తామని, నూతన మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించారు.
మద్యం దుకాణాల ఏర్పాటుకు 28 దరఖాస్తులు
సిద్దిపేట ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ఊపందుకుంది. 5 సర్కిళ్ల పరిధిలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఎక్సైజ్‌శాఖ అధికారులు 9 కౌంటర్లు ఏర్పాటు చేసి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గురువారం సిద్దిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 4 దరఖాస్తులు, మిరుదొడ్డి 3, హుస్నాబాద్5, చేర్యాల 1, గజ్వేల్ 6 ఇలా మొత్తం 19 దరఖాస్తులు స్వీకరించారు. మూడు రోజుల్లో మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయి.