సిద్దిపేట టౌన్, నవంబర్ 6 : జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని, సిల్వర్ జూబ్లీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదికా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న లీగల్ సర్వీసెస్ మెగా క్యాంపును సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ పాపిరెడ్డి చెప్పారు. శనివారం సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్ సమావేశ మందిరంలో లీగల్ సర్వీసెస్ మెగా క్యాంపు నిర్వహణపై 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి నీలిమ, మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్తో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ న్యాయపరమైన ఉచిత సేవలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఏ పౌరుడు ఆర్థిక కారణాలు, ఇతర బలహీనతల మూలంగా న్యాయాన్ని పొందే అవకాశం కోల్పోకూడదని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం అందించాలని గొప్ప ఆశయంతో జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి న్యాయసేవలపై అవగాహన కల్పించే అధికారులు, సిబ్బందికి న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మెగా లీగల్ సర్వీసెస్ క్యాంపునకు ముఖ్యఅతిథిగా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి అభిషేక్ హాజరవుతున్నారన్నారు. అంతకుముందు న్యాయమూర్తి పాపిరెడ్డి పట్టణంలోని విపంచి కళానిలయాన్ని సందర్శించి, న్యాయ విజ్ఞాన మెగా సదస్సు ఏర్పాట్లు పరిశీలించి చర్చించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆశలత, జూనియర్ సివిల్ జడ్జి ఫాతిమా, డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవో అనంతరెడ్డి, డీఆర్డీవో గోపాల్‌రావు, డీడబ్ల్యూవో, డీఈవో, డీపీఆర్వో దశరథం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, న్యాయవాదులు వెంకటలింగం, మణి, ప్రకాశ్ పాల్గొన్నారు.