‘రైతులు మార్కెట్‌ను అందుకోవాలి.. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి.. లాభదాయక పంటలు పండించాలి.. అభివృద్ధి సాధించాలి’.. అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం చిన్నకోడూరులో రైతు వేదికను ప్రారంభించిన ఆయన, అక్కడే 750మంది రైతులకు సన్ ప్లవర్ విత్తనాలను పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నూతన మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు వర్షాలకు ఇండ్లు దెబ్బతిన్నవారికి ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట-చిన్నకోడూరు వరకు 10కి.మీ. మేర రూ.80 కోట్లతో నాలుగు లేన్ల రహదారి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మంత్రి సిద్దిపేటలో విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్ల్లో పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
చిన్నకోడూరు, నవంబర్ 6 : మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌కు అనుగుణంగా రైతులు ఆలోచించి, ప్రత్యామ్నాయ పంటలు పండించి లాభాలు గడించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ-ఎఫ్‌పీవో కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ఎఫ్‌పీవో ఉద్దేశమని పేర్కొన్నారు. శనివారం చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం, అందులోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండలం మాచాపూర్, చౌడారం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు సన్‌ప్లవర్ విత్తనాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూరు మండలంలో వెయ్యి ఎకరాలకు సన్‌ప్లవర్ పండించేందుకు విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పొద్దుతిరుగుడు, తేనె ఉత్పత్తి ద్వారా కలిగే లాభాలను రైతులకు విడుతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ ఇవ్వాలని ఆయా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం మరింత సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం రూ.90వేల కోట్ల విదేశీ మాదకద్రవ్యం కోల్పోతున్నట్లు, పామాయిల్ సాగు లాభసాటిగా ఉన్నదని పామాయిల్ తోటలను ప్రోత్సహించాలని రైతులను, ప్రజాప్రతినిధులను కోరారు. చిన్నకోడూరు మండలంలో ఎఫ్‌పీవో వెయ్యి ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఓ వరమని మంత్రి పేర్కొన్నారు. ఈసారి సిద్దిపేట జిల్లాలో వరి రికార్డు స్థాయిలో 7లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వచ్చిందని, గతంలో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని పేర్కొన్నారు. తెలంగాణలో పండిన పంట మొత్తం కొనడానికి కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ పండిన పంట ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు సమస్యగా మారిందన్నారు. చిన్నకోడూరు మండలంలో రైతుబంధు కింద రూ.20కోట్లు, రైతుబీమా కింద 140 మంది రైతులకు రూ.7 కోట్లు ప్రభుత్వం వెచ్చించినట్లు గర్వంగా చెప్పుకునే పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, జిల్లా అటవీ శాఖ డైరెక్టర్ శ్రీని
వాస్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ వెంకటేశం, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రామచంద్రం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇట్లబోయిన శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అనంతరెడ్డి, స్థానిక ఎంపీటీసీ శారద రమేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణరెడ్డి, అబ్బిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట-చిన్నకోడూరు ఫోర్‌లేన్..
సిద్దిపేట పట్టణం బారాఇమామ్ చౌరస్తా నుంచి చిన్నకోడూరు వరకు 10కి.మీ. మేర రూ.80 కోట్లతో నాలుగు లేన్ల రహదారి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం చిన్నకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిన ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లి, నార్మల్ డెలివరీ చేసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలో ఏరియా ప్రభుత్వ దవాఖానలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇవ్వని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.