సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మరణించారు. ఎస్ఐ రాజేశ్వర్ (SI Rajeshwar) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు ముగించుకున్న ఆయన.. సంగారెడ్డి జిల్లా చాణక్యపురి కాలనీలోని తన నివాసానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి చేర్యాల గేటువద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్ రాజేశ్వర్.. దవాఖానకు తరలిస్తుండగా మరణించారు.
1990లో పోలీసు శాఖలో ఉద్యోగం చేరిన రాజేశ్వర్.. వారం రోజుల క్రితమే ఫిల్మ్ నగర్ పీఎస్లో బాధ్యతలు స్వీకరించారు. గత మూడు రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.