‘ఈ సినిమాను ప్రేక్షకులకు తొందరగా చూపించాలని ఎదురుచూస్తున్నా. గొప్ప చిత్రం చేశామని మా టీమ్ అందరిలో సంతృప్తి ఉంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. రాహుల్సంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. ఈ నెల 24న ప్రేక్షకులముందుకురానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా మీద టీమ్ అంతా విశ్వాసంతో ఉన్నాం. సాయిపల్లవి, కృతిశెట్టి అద్భుతంగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా డబ్బా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది.
ఈసారి క్రిస్మస్ మాత్రం మనదే’అన్నారు. ‘ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లిపోవాలని తపించే ప్రతి ఒక్క మేకర్‌కు నా జోహార్లు. ఈ సినిమా కూడా అలాంటి ప్రయత్నమే. అందరం చీమల్లా కష్టపడి ఒక్కోరాయి పేర్చుకుంటూ ఈ గుడి కట్టాం. సిరివెన్నెలగారు చివరి పాటను మా సినిమాకు రాయడం విధి నిర్ణయంగా భావిస్తున్నాం. అనురాగ్కులకర్ణి ఆ పాట పాడుతుంటే సిరివెన్నెల పక్కనే ఉన్నట్లనిపించింది. సాయిపల్లవి తన పాత్రకు ప్రాణం పోసింది. ఈ సినిమాలో కొత్త నానిని చూస్తారు. యాభైఏళ్లు వెనక్కి వెళ్లి శ్యామ్‌ను కలుద్దాం..మా సినిమా మీకోసం ఎదురుచూస్తోంది’ అని దర్శకుడు తెలిపారు. సినిమాలో తాను పోషించిన కీర్తి పాత్ర యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని కృతిశెట్టి తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి
ఈ వేడుకలో కథానాయిక సాయిపల్లవి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేక్షకులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు హృదయాన్ని కదిలించాయని చెప్పింది. ‘కథానాయికగా నాకు అవకాశాలిస్తున్న పరిశ్రమకు..నాపై విశ్వాసంతో మంచి పాత్రల్ని సృష్టిస్తున్న దర్శకులందరికి కృతజ్ఞతలు. ఏ సినిమాను నేను కష్టంగా భావించలేదు. ప్రతి పాత్రను ఇష్టపడి చేశాను. జాతీయ అవార్డు తీసుకునేటప్పుడు కన్నీళ్లు వస్తాయనుకున్నా..కానీ ఓ నటిగా ఈ వేదికపై ఉండటమే పెద్ద అవార్డని ఇప్పుడు అర్థమైంది. అందుకే నాకు కన్నీళ్లొచ్చాయి’ అంటూ సాయిపల్లవి భావోద్వేగభరితంగా మాట్లాడింది.