
చుట్టూ పచ్చని వాతావరణం.. పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి.. మధురానుభూతిని మిగిల్చే పరిసరాలు.. అనేక రకాల పంటలు.. కలుషిత ప్రపంచానికి దూరంగా పల్లె వాతావరణం.. ఇవన్నీ చదువుతుంటేనే అబ్బా ఇలాంటి జీవితం మనకూ సొంతమైతే బాగుంటుంది అని చాలామందికి అనిపిస్తుంది. ఔను.., పల్లె వాతావరణాన్ని కోరుకుంటూ ప్రకృతి చెంతనే జీవించేందుకు ఇప్పుడు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. పల్లెల్లో ఫాంహౌస్ కల్చర్ విస్తరిస్తున్నది. అనేక మంది పంటపొలాల వద్ద ఫాంహౌస్‌లు నిర్మించుకొంటున్నారు. తమకు కావల్సిన విధంగా ఆకట్టుకునే రీతిలో నిర్మాణాలు చేసుకొని అక్కడే జీవిస్తున్నారు. మరికొంతమంది పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడి నుంచే ప్రయాణం కొనసాగిస్తుండగా, ఇంకొంతమంది వారాంతపు సెలవుల్లో ఫాంహౌస్‌లకు వెళ్లి సేదతీరుతున్నారు. కరోనా మహమ్మారి ప్రకృతి గొప్పతనాన్ని తెలియజేసింది. మనిషి సహజ సిద్ధంగా బతకడానికి అలవాటు చేసింది. దీంతో ఇప్పుడు జీవన విధానం మారింది. కొవిడ్ సమయంలో పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల్లోకి వచ్చిన చాలామంది ప్రజలు.. ఇప్పుడు అక్కడే ఫాంహౌస్‌లు నిర్మించుకొని, పంటలు పండించుకుంటూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఉరుకులు పరుగులు, కాలుష్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. పల్లెల్లో
కరోనా కాలం మనిషి జీవన విధానంలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. నేటి ఆధునికయుగంలో చంద్రమండలానికి దగ్గరవుతున్నప్పటికీ ప్రకృతికి మాత్రం దూరమవుతున్నాడు. ప్రకృతి ప్రసాదాలైన గాలి, నీరు సైతంకలుషితమవుతున్న ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు తన వ్యవసాయ క్షేత్రాన్ని ఎంచుకుని ఫాంహౌస్ కల్చర్‌ను తీసుకువస్తున్నాడు. పొలం చెంతనే ఆవాసాలను (ఫార్మర్‌హౌస్) ఏర్పాటు చేసుకుంటున్నాడు. నిత్యం పట్టణాల్లో ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్న వారు ఇప్పుడు దానిని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పచ్చని చేను, చెలకలతో పాటు పక్షుల కిలకిలరావాల మధ్య ప్రకృతి
ఒడిలో జీవనం కొనసాగిస్తున్నారు. అక్కరకు వచ్చే పంటలు పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెరుగుతున్న ఫాంహౌస్ కల్చర్..
వ్యాపారులు, ఉద్యోగులు, విదేశాల్లో ఉండే వారు పల్లెల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి గృహాలు నిర్మాణం చేసుకుని ప్రశాంతంగా జీవనం సాగించేందుకు ఇష్టపడుతున్నారు. ఎక్కువగా డబ్బులు ఉన్న వారు వ్యవసాయ భూముల్లో ఇండ్ల నిర్మాణం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరాల్లో ప్రతి రోజూ వివిధ రకాల కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ జీవనం సాగించడంతో విసుగు చెందుతున్న వారు పట్టణాలకు దూరంగా ఒక్క రోజైనా గడపాలని భావిస్తున్నారు. మధ్యతరగతి వారు దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కాటేజీల్లో బస చేస్తుంటే, ధనికులు సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్‌లను నిర్మించుకుంటున్నారు. పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఈ ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి సహజసిద్ధ వాతావరణంలో జీవిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పెరిగిన నిర్మాణాలు..
ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫాంహౌస్ కల్చర్ పెరుగుతున్నది. పటాన్చెరు, సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు పట్టణాలైన సిద్దిపేట, మెదక్, తూప్రాన్ వంటి ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ఎక్కువగా ఫాంహౌజ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 65వ జాతీయ రహదారి ప్రాంతమైన జహీరాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పదుల సంఖ్యలో ఫాంహౌజ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో ఉన్న వ్యవసాయ భూములు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చెందిన వారు ఫాంహౌస్‌లు నిర్మాణం చేసుకుంటున్నారు. మద్దూరు, వంగపల్లి, మర్మాముల, సలాఖపూర్, లద్నూర్, నర్సాయపల్లి, ధూళిమిట్ట తదితర గ్రామాల్లోనూ రైతులు ఫార్మర్హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా గతంలో ఉపాధి కోసం ఊరు విడిచి వెళ్లిన ఎంతోమంది గ్రామాలకు తిరిగి చేరుకొని వ్యవసాయ బావుల వద్దనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది యువకులు వ్యవసాయాన్ని ఓ ఫ్యాషన్‌గా ఎంచుకుంటున్నారు. పొలం చెంతనే ఫార్మర్ హౌజ్‌లను ఏర్పాటు చేసుకొని విభిన్న రీతుల్లో వ్యవసాయా న్ని కొనసాగిస్తున్నారు. ఫార్మర్హౌజ్లో నే తమ కుటుంబంతో స్వచ్ఛమైన గాలి, నీరుతో పాటు ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు.
వ్యవసాయ క్షేత్రల్లో భద్రతకు ప్రాధాన్యం..
పట్టణాలకు దూరంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఇండ్లు నిర్మించుకునే వారు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయ భూమి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకుని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఫాంహౌస్‌లో సీసీ కెమెరాలు, కాపలాదారుడిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారానికోసారైనా గృహాలను శుభ్రం చేస్తూ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఫాంహౌస్‌లో పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయల తోటలు పెంచుతున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు, ఈత కొలనులు, ఆటల కోర్టులు, ఉదయం సాయంత్రం నడకకు దారులు నిర్మాణం చేసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రల్లో గృహాలు నిర్మాణం చేసుకుని ప్రశాంతంగా జీవనం సాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మూగజీవాలే మా నేస్తాలు..
మేము గతంలో హైదరాబాద్‌లో ఉండేది. ఐదేండ్ల క్రితం వచ్చి మా భూమిలోనే డబుల్బెడ్రూం ఇల్లు కట్టుకున్నాం. పట్టణాల కంటే పల్లె వాతావరణమే బాగుంటుంది. మా బావిదగ్గరనే వాతావరణం బాగుంది. ఇప్పుడు సిటీకి వెళ్తే ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. ఏ టైమైనా సరే రాత్రి వరకు వచ్చేస్తున్నాం. పండుగలకు పిల్లలను కూడా ఇక్కడికే రమ్మని చెబుతున్నం. ఆవులు, కోళ్లు, గొర్రెలు, మేకలతోనే ఆనందంగా గడుపుతున్నాం.
బావిదగ్గరే కొత్త ఇల్లు కట్టుకున్న..
వ్యవసాయం ఓ దగ్గర, ఇల్లు ఓ దగ్గర ఉంటే చాలా ఇబ్బంది అయితుందని ఈ మధ్యలోనే బావి దగ్గర ఇల్లును కట్టుకున్న. ఇప్పడు అన్నిటికీ సౌలత్గా ఉంది. బావి దగ్గర ఇల్లు ఉంటే సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా మన పని మనమే చేసుకోవచ్చు. ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, పశువులను చూస్తే కడుపు నిండినట్లనిపిస్తది. ఇప్పడైతే ఊల్లోకంటే బావి దగ్గరే ప్రశాంతంగా ఉంది.