నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
యువ రక్తానికి.. అనుభవసారాన్ని జోడించిన కోల్‌కతా.. ముచ్చటగా మూడో టైటిల్ పట్టేందుకు సమాయత్తమవుతున్నది.ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడకనబరుస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన ఫ్రాంచైజీ.. వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైన్, కమిన్స్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై, చెన్నై తర్వాత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తీన్మార్ ఆడాలని తహతహలాడుతున్నది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో రెండు సార్లు (2012, 14) టైటిల్ నెగ్గిన కోల్‌కతా.. మూడోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. గత సీజన్లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన సారథి ఇయాన్ మోర్గాన్‌ను రిటైన్ చేసుకోని కేకేఆర్.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందే వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైన్, వరుణ్‌ను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ.. అజింక్యా రహానే, సామ్ బిల్లింగ్స్, పాట్ కమిన్స్, మహమ్మద్ నబీ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది. బ్రెండన్ మెక్కల్లమ్ శిక్షణలో ముందుకు సాగుతున్న కేకేఆర్.. 15వ సీజన్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.