హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ల కొరత వేధిస్తున్నది. కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు(సీఆర్టీ), అకడమిక్ ఇన్స్ట్రక్టర్(ఏఐ)లతోనే విద్యా బోధన కొనసాగుతున్నది. అంతేకాకుండా భారీగా పోస్టులు ఖాళీగా ఉండటంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన దూరమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 322 ఆశ్రమ పాఠశాలలున్నాయి. ప్రతి ఆశ్రమ పాఠశాలలో కనీసం 14 మంది టీచర్ల అవసరం ఉంది. ఈ విధంగా చూసుకుంటే 4500 మంది టీచర్లు ఉండాలి.. కానీ 2,102 మంది సీఆర్టీలే పని చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలుగా మారిన 54 హాస్టళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ అన్న ముచ్చటే లేదు. 54 ఆశ్రమ పాఠశాలల్లో అయితే సీఆర్టీలను కూడా నియమించలేదు. కేవలం ఏఐ పోస్టులతోనే పాఠాలు బోధిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ భారీగా ఖాళీలున్నా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడుతున్నారు. రెగ్యులర్ టీచర్ల స్థానంలోకి తమను తీసుకోవాలని సీఆర్టీలు 19 రోజులపాటు ధర్నాలు నిర్వహించారు. అయినా రేవంత్ సర్కార్ పట్టించుకోవడంపై సీఆర్టీల సంఘం నాయకుడు సంతోష్‌నాయక్ డిమాండ్ చేస్తున్నారు. కనీసం తమను సీఆర్టీలుగా అయినా గుర్తించి, వారి మాదిరిగానే జీతాలు ఇవ్వాలని ఏఐ సంఘం రాష్ట్ర నాయకుడు సురేందర్‌నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.