Scholorship | యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ (University of Sheffield) 2027కు సంబంధించిన స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆ యూనివర్సిటీ ఎంపిక చేసిన దేశాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పించింది. ఆ దేశాల జాబితాలో భాగంగా భారతీయ విద్యార్థులకు కూడా ఈ అవకాశం లభించనుంది. స్కాలర్షిప్ ప్రకారం ఏడు వేల పౌండ్ల (రూ. 8 లక్షలు) వరకు ట్యూషన్ ఫీజులో రాయితీని కల్పించింది. దీంతో ఆ యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (PG) కోర్సును పూర్తిచేయవచ్చు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు యూకేలో పీజీ విద్యను చౌకగా అందించడమే ఈ స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశమని ఆ యూనివర్సిటీ పేర్కొంది.
ఎవరికి ఈ అవకాశం
ఈ ఫీజు రాయితీ పొందాలంటే ఫుల్ టైమ్ పీజీ కోర్సు కోసం ఆఫర్ లెటర్ పొంది ఉండాలి. ఆ యూనివర్సిటీ ప్రకటించిన దేశంలో శాశ్వతంగా లేదా 3 సంవత్సరాలుగా నివసించి ఉండాలి. ఫీజుల పరంగా ఓవర్సీస్ విద్యార్థిగా గుర్తింపు పొందాలి. కోర్సు ఫీజులను విద్యార్థే చెల్లించాలి (Self Funding). స్పాన్సర్ లేదా ఇతర ఎక్స్టర్నల్ స్కాలర్షిప్లు పొందిన వారికి ఇది వర్తించదు. ఈ అవకాశం భారతదేశంతో పాటు జపాన్, కెన్యా, నైజీరియా, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్, తుర్కియే, వియత్నాం దేశాలకు చెందిన విద్యార్థులకు లభిస్తుంది. ఆయా దేశాల విద్యార్థులు 2027, జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు షెఫీల్డ్ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, ఆన్లైన్, డిస్టెన్స్ కోర్సులు, క్రాస్వేస్, ఎరాస్మస్ ముండూస్ కోర్సులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు.
ఈ రాయితీ పొందాలంటే అర్హతగల విద్యార్థులు షెఫీల్డ్ యూనివర్సిటీలోనే కోర్సును చదవాలి. రెండేండ్ల మాస్టర్స్ ప్రోగ్రామ్ (Masters Programme)లో చేరిన వారు మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తిచేస్తేనే రెండో సంవత్సరంలో 7 వేల పౌండ్ల స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కోర్సులో ప్రవేశం పొందగానే దీనికి అర్హులవుతారు. 2027, సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫుల్‌టైమ్ పీజీలో ఆఫర్ లెటర్ అందినవారికి ఈ స్కాలర్షిప్ లభిస్తుంది.