చిన్న వయసులోనే పెళ్లి ఆలోచనలు వద్దంటూ.. అమ్మాయిలకు సలహా ఇస్తున్నది బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా. వ్యక్తిగత జీవితం గురించి పూర్తిస్థాయిలో అవగాహన రాకముందే.. వివాహంపై ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదని అంటున్నది. ఓ ప్రముఖ యూట్యూబర్‌తో నిర్వహించిన చిట్ చాట్‌లో పాల్గొన్నది షెఫాలీ. పెళ్లి-పిల్లల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నది. ఇందులోని కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా షెఫాలీ మాట్లాడుతూ.. పెళ్లి అనేది ఒక బాధ్యత అనీ, దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని అంటూ అభిప్రాయపడ్డది. “అందుకే, ముందుగా మీకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందో లేదో తెలుసుకోండి. ప్రపంచాన్ని చూడండి. వ్యక్తుల్ని కలవండి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఓ నిర్ణయానికి రండి!” అంటూ సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పిల్లల్ని కనడం కన్నా.. కుక్కలను పెంచుకోవడం మంచిదనీ, కుక్కల దగ్గరే నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుందని పేర్కొన్నది. “ఎందుకంటే, పిల్లల కోసం మనం ఎంతో చేస్తాం.
కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో అంచనాలు, స్వతంత్ర భావాలు పెరుగుతాయి. ఒకానొక సమయంలో వారు మనల్ని కాదనవచ్చు. మన మాట వినకపోవచ్చు. ఇది సహజం. కానీ, కుక్కలు ఎప్పుడూ ఒకే రకమైన ప్రేమనూ, నమ్మకాన్నీ చూపుతాయి” అంటూ చెప్పుకొచ్చింది. పిల్లల గురించి షెఫాలీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది మాత్రం.. ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. ఇక షెఫాలీ షా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టింది షెఫాలీ. ‘రంగీలా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 1994లో హర్ష్ ఛాయాను వివాహం చేసుకున్న షెఫాలీ.. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నది. అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్ లాల్‌తో పెళ్లి పీటలెక్కింది. వీరికి ఇద్దరు సంతానం. షెఫాలీ జంతు ప్రేమికురాలు కూడా. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నెట్‌ఫిక్స్‌లో విడుదలైన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 3’లో డీసీపీ వర్తికా చతుర్వేదిగా మెప్పించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది.