న్యూఢిల్లీ : తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 19, 20 తేదీలలో చైనాను అధికారికంగా సందర్శించనున్నట్లు రష్యా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రష్యా, చైనా మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ యోచిస్తున్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
చైనా ప్రధాని లీ కియాంగ్తో ఆర్థిక, వాణిజ్య సహకారంపై కూడా పుతిన్ చర్చించనున్నారు. 2001లో మంచి పొరుగు సంబంధాలు, స్నేహపూర్వక సహకార ఒప్పందంపై రష్యా, చైనా సంతకాలు చేసి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతున్నదని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించుకుని వెళ్లిపోయిన మరుసటి రోజు పుతిన్ పర్యటన ఖరారు కావడం గమనార్హం.