పుణె, ఏప్రిల్ 3: బీజేపీ వ్యతిరేక కూటమికి తాను సారథ్యం వహించబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. యూపీఏకు అధ్యక్షత వహించాలని కూడా తనకు లేదన్నారు. కొల్హాపూర్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించే క్రమంలో కాంగ్రెస్ను పక్కన పెట్టడానికి లేదన్నారు. ‘ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ర్టాల్లోనే బలంగా ఉంటాయి. కానీ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కార్యకర్తలు ఉన్నారన్న సంగతి విస్మరించవద్దు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ‘నిజానికి ప్రత్యామ్నాయ ఏర్పాటుపై ఇప్పటికే పనిచేస్తున్నాం’ అని పవార్ వ్యాఖ్యానించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సాధ్యమని పవార్ పేర్కొన్నారు.