షూటింగ్స్‌లో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటివల్ల కథానాయకులు తీవ్రంగా గాయపడ్డ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా పోరాట ఘట్టాల చిత్రీకరణలో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కానీ హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ సాధన చేస్తూ తాను తీవ్రంగా గాయపడినట్లు షాహిద్‌కపూర్ పేర్కొన్నారు. కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని ఆయన చెప్పారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా తాలూకు ప్రయాణం గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షాహిద్‌కపూర్ ముచ్చటిస్తూ ‘క్రికెటర్ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్ బలంగా తాకడంతో నా క్రింది పెదవి చిట్లింది. 25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నారు. నాని కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ‘జెర్సీ’కి రీమేక్ ఇది. హిందీలో అల్లు అరవింద్ సమర్పణలో దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మిస్తున్నారు.