న్యూఢిల్లీ: కేరళ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. 74 ఏళ్ల సామాజిక కార్యకర్త చంద్రన్పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు అయ్యింది. 2020లో ఆ కేసు బుక్కైంది. అయితే నందీ బీచ్లో తనను లైంగికంగా వేధించినట్లు ఆ కార్యకర్తపై ఓ యువ రచయిత్రి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో కోర్టు తీర్పునిస్తూ.. ఒకవేళ ఫిర్యాదు చేసిన మహిళ .. లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే, అప్పుడు ఆ కేసు లైంగిక వేధింపు కిందకు రాదు అని కేరళ హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కార్యకర్త చంద్రన్కు బెయిల్ కూడా మంజారీ చేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రన్ తన దరఖాస్తుతో పాటు ఆ యువతి ఆ సమయంలో ధరించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు.
ఐపీసీలోని 354ఏ సెక్షన్ ప్రకారం.. ఒకవేళ అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే ఆ కేసు నిలువదని కోర్టు చెప్పింది. నిందితుడు సమర్పించిన ఫోటోలను గమనిస్తే, ఆ అమ్మాయి కావాలనే లైంగికంగా ప్రేరేపిస్తున్నట్లు ఉందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. అందుకే ఈ కేసులో 354ఏ సెక్షన్ వర్తించదు అని కోర్టు తెలిపింది. 74 ఏళ్ల చంద్రన్కు శారీరకంగా వైకల్యం ఉందని, మరి అలాంటి వ్యక్తి మరో వ్యక్తిని బలవంతం చేయలేడని కోర్టు పేర్కొన్నది.