కీవ్, ఏప్రిల్ 4 : భీకర దాడులతో ను ధ్వంసం చేస్తున్న రష్యా బలగాలు.. మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్ల బాలికపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా, మహిళల శరీరాలపై ప్రత్యేక గుర్తుల(స్వస్తిక్ ఆకారంలో)తో తీవ్ర గాయాలు చేస్తూ రష్యా సైనికులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ఉక్రెయిన్ మహిళా ఎంపీ లెసియా వాసిలెంక్ సోమవారం ఆరోపించారు. ‘అనైతిక నేరాల దేశం’గా రష్యాను ఆమె అభివర్ణించారు. మారణహోమాన్ని, పుతిన్‌ను వెంటనే ఆపండి’ అని వేడుకున్నారు.
బుచా పట్టణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం పర్యటించారు. దేశంలో శాంతి నెలకొనేందుకు రష్యాతో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. బుచాను వీడివెళ్తూ రష్యా సైనికులు స్థానిక పౌరులను ఊచకోత కోశారన్న వార్తలను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ వాదనలపై విచారణకు ఆదేశించినట్టు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ చీఫ్ అలెగ్జాండర్ బస్ట్రికిన్ పేర్కొన్నారు. బుచాకు సంబంధించి వస్తున్న ఫొటోలు, వీడియోలు ఫేక్ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. పుతిన్ యుద్ధ నేరస్థుడు అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి వ్యాఖ్యానించారు. బుచాలో రష్యా సైనికుల దురాగాతాలపై దర్యాప్తునకు పిలుపునిచ్చారు.
ఆదివారం రాత్రి డొనెట్స్, లూహాన్స్ ప్రాంతాల్లో రష్యా దాడులను తిప్పికొట్టినట్టు ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రష్యాకి చెందిన మూడు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను నేలకూల్చినట్టు తెలిపాయి. ఇజియూమ్లో సుఖోయ్-35ఎస్ విమానాన్ని కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. సుమీ నుంచి రష్యా సైనికులు వెళ్లిపోతున్నారని స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. లొంగిపోయి ఆయుధాలు అప్పగించే రష్యా సైనికులకు 10 లక్షల డాలర్లు వరకు రివార్డు ఇచ్చేందుకు ఉక్రెయిన్ నిర్ణయించింది.