ఖమ్మం రూరల్, మే 27 : ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు బుధవారం తీర్పు వెల్లడించారని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2023 మే 28న నిందితుడైన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు.
టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 279/2023.SC.పొక్సో, 40/2023 U/S 323 354 (A)(B) 506 IPC సెక్షన్ 8 ఆఫ్ పొక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువు కావడంతో తీర్పువెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ అధికారులు ఎస్ఐ వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం.వెంకయ్య , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోం గార్డ్ చిట్టిబాబును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.