Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా రెండోరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా నాలుగు సెషన్లలో మూటగట్టుకున్న నష్టాలకు సోమవారం నాటి ట్రేడింగ్‌తో బ్రేక్ పడింది. సోమవారం నాటి జోషే మంగళవారం కూడా కనిపించింది. మంగళవారం కూడా దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఫార్మా (Pharma), ప్రైవేట్ బ్యాంకింగ్ (Private Banking), చమురు-గ్యాస్ షేర్ల (Oil and Gas shares) ను కొనుగోలు చేశారు.
దాంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో సెషన్లోనూ లాభపడ్డాయి.సెన్సెక్స్ 685.34 పాయింట్లు పెరిగి 73,067.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 220.35 పాయింట్లు లాభపడి 22,776.10 వద్ద స్థిరపడింది. దాంతో నిఫ్టీ మరోసారి 22,750 మార్కును చేరింది. నిఫ్టీ 22,800 స్థాయిని నిలబెట్టుకుంటే 23,000 మార్కు దిశగా వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగువన 22,600 వద్ద తక్షణ మద్దతు ఉందని, ఆ తర్వాత 22,500 కీలక స్థాయిగా ఉంటుందని తెలిపారు. అమ్మకాల ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నదని చెప్పారు.
ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయంపై మార్కెట్ వర్గాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. వడ్డీ రేట్లు, నగదు లభ్యత, ఆర్థిక పరిస్థితులపై కేంద్ర బ్యాంకు వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. నిఫ్టీలో ట్రెంట్, బీఎస్ఈ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫార్మా, కెమికల్ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా కనిపించాయి. నిఫ్టీ ఫార్మా సూచీ అత్యధికంగా లాభపడగా, కెమికల్ సూచీ ఆ తర్వాత స్థానంలో నిలిచింది.