నిజాంసాగర్/కామారెడ్డి, జూలై 30: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లు చేస్తున్న వీడియో వైరల్‌గా మారగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గతంలో సలాబత్పూర్ వద్ద రవాణా, ఎక్సైజ్ చెక్‌పోస్టులుండేవి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో, ఇక్కడ ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టు మాత్రమే కొనసాగుతున్నది. రెండురోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ మహారాష్ట్ర నుంచి వస్తుండగా, ఎక్సైజ్ పోలీసు దుస్తులతో ఉన్న వ్యక్తితోపాటు మరొకరు లారీని ఆపి, డబ్బులు అడిగారు. సదరు డ్రైవర్ ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
‘మీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి. ఆసలు మీరు ఎవరు? యూనిఫామ్ వేసుకున్నారు కానీ దానిమీద డిపార్ట్మెంట్ పేరు.. నేమ్‌ప్లేట్ లేదు. మీరెందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు’ అని సదరు డ్రైవర్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఇతరలారీల డ్రైవర్ల వద్ద వసూలు చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కాగా సలాబత్పూర్ చెక్‌పోస్టు ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు జారీ చేశామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి తెలిపారు.
అంతర్రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం, గంజాయి, మత్తుపదార్థ్ధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలాబత్పూర్ చెక్‌పోస్టు వద్ద నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామన్నారు. బుధవారం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకున్నదని తెలిపారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను సుధాకర్‌రెడ్డిగా గుర్తించామని చెప్పారు. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ నివేదిక పంపినట్టు ఈ మేరకు తెలిపారు.