కాబూల్ : అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై అనేక ఆంక్షల్ని విధిస్తున్న అక్కడి తాలిబన్ సర్కార్..వధువుపైనా కఠిన నిబంధనల్ని ప్రకటించింది. వివాహ సమయంలో వధువు మేకప్ వేసుకోవటాన్ని కూడా నిషేధించింది. నిశ్చితార్థం, వివాహ వేడుకలు ఇకపై ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఉండాలంటూ తాలిబన్లు తాజాగా ఓ డిక్రీ విడుదల చేశారు.
వివాహ సమయాల్లో వధువు మేకప్ ధరించటం, మెహంది వేసుకోవటం, పొడవైన జడ కోసం జడ కుచ్చులు వాడటం, అత్తరులు జల్లుకోవటం సర్వసాధారణం. ఇవేవీ ఇకపై పెండ్లి వేడుకల్లో కనిపించడానికి వీల్లేదు అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
కొత్త రూల్స్‌పై మసీదుల్లో మత గురువులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వధూవరులు ఉంగరాలు మార్చుకోవటం, పాటలు పాడుతూ డ్యాన్సులు చేయటాన్ని ఇప్పటికే బ్యాన్ చేశారు. ఈ విధమైన సంప్రదాయాలు, పద్ధతులు పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని పెంచుతాయని తాలిబన్లు చెబుతున్నారు.