న్యూఢిల్లీ, నవంబర్ 26: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సన్నద్దమవుతున్నదని సంబంధిత వర్గాలు ద్వారా తెలుస్తున్నది. సెమికండక్టర్ చిప్స్ కొరతతో ఆటోమొబైల్స్, టెలికం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలు అల్లాడిపోతున్న నేపథ్యంలో సెమికండక్టర్ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటాలు చర్చలు జరుపుతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అవుట్సోర్స్డ్ సెమికండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) ప్లాంట్ కోసం తగిన స్థలాన్ని అన్వేషిస్తూ తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ర్టాలతో కూడా టాటాలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాల్ని రాయిటర్స్ ఉటంకించింది. ఈ ఓశాట్ ప్లాంట్&ఫౌండ్రీలో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబుల్ చేసి ఫినిష్డ్ సెమికండక్టర్ చిప్స్‌గా రూపొందిస్తారు. సెమికండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఇటీవలే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. తెలంగాణలో టాటాలకు ఏరోస్పేస్, ఏరోస్ట్రక్చర్స్, డిఫెన్స్ సంబంధిత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి హై టెక్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్‌కు హైదరాబాద్‌లో భారీ సాఫ్ట్వేర్ కేంద్రాలు ఉన్నదీ విదితమే.
తాజాగా ప్రతిపాదించిన సెమికండక్టర్ ప్లాంట్‌లో 30 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 2,200 కోట్లు) టాటా గ్రూప్ పెట్టుబడి చేస్తుందని చెపుతున్నారు. ఫ్యాక్టరీ కోసం ప్రస్తుతం స్థలాల్ని అన్వేషిస్తున్న టాటాలు ఎక్కడ ఏర్పాటుచేసేదీ వచ్చే నెలలో ఖరారు చేస్తారని భావిస్తున్నారు. ఈ ప్లాంటు 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. నైపుణ్యంగల సిబ్బంది లభ్యత, ప్లాంట్ వ్యయం వంటి అంశాలు ప్రాజెక్టు దీర్ఘకాలిక మనుగడకు కీలకమని, ఈ దిశగా ప్రాంతాన్ని ఎంపికచేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2022 ద్వితీయార్థంలో ప్లాంట్ ప్రారంభమవుతుందని అంచనా. టాటాల ఓశాట్ వ్యాపారానికి ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్ తదితర దిగ్గజ కంపెనీలు క్లయింట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే గ్రూప్‌లోని పలు వ్యాపారాలకు కూడా సెమికండక్టర్ చిప్స్ అవసరాలు ఎక్కువ. ఇటీవల టాటాలు టేకోవర్ చేసిన టెలికాం ఎక్విప్మెంట్ తయారీ సంస్థ తేజాస్ నెట్‌వర్క్‌తో పాటు టాటా పవర్, టాటా మోటార్స్, జేఎల్ఆర్ వంటి కంపెనీలకు సెమికండక్టర్స్ కీలకమైనవి.