టెక్సాస్, జూన్ 29: డ్రైవర్ లేకుండా తనంత తానుగా(యజమాని కోరినట్టు) కారు పనిచేయటమన్నది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్‌తో కారును కస్టమర్‌కు డెలివరీ చేసిన ఘనతను ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ అందుకుంది. టెస్లా-వై మోడల్ కారు టెక్సాస్‌లోని కంపెనీ ఫ్యాక్టరీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్‌తో బయల్దేరి జాతీయ రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్స్ దాటుకొని 30 నిమిషాల్లోనే కస్టమర్ ఇంటికి చేరుకుంది.
ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘టెస్లా’ సాధించిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రైవర్‌లెస్ కారును కస్టమర్ ఇంటికి పంపగలిగామని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో ప్రకటించారు. రిమోట్ ఆపరేషన్స్, కారులో మానవ ప్రమేయం లేకుండా కస్టమర్ ఇంటికి కారు వెళ్లిందని ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేశారు. ఈ ప్రయాణంలో పట్టణాలు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్లు దాటుకొని కారు సురక్షితంగా గమ్యస్థానానికి వెళ్లినట్టు చెప్పారు. కారు సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ వెనుకున్న టెస్లా ఏఐ బృందాలను మస్క్ అభినందించారు.